China Tariff : అమెరికా మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధంలో చైనా దెబ్బకు దెబ్బ అంటూ సంకేతాలు పంపింది. ఈ మేరకు తాజాగా వాషింగ్టన్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34శాతం టారిఫ్‌లను విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఏప్రిల్ 10వ తేదీ ఇది అమల్లోకి రానున్నట్లు చెప్పింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులపై ఇది వర్తిస్తుందని ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ టారిఫ్ కమిషన్ వెల్లడించింది. వాషింగ్టన్ చర్యలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని ఆరోపించింది. ఏకపక్షంగా ఆర్థిక బెదిరింపులకు పాల్పడుతోందని వెల్లడించింది.

ఏప్రిల్ 10 మొదలు అదనపు సుంకాలు
చైనాలోని టారిఫ్ చట్టం, కస్టమ్స్ చట్టం, విదేశీ వ్యాపార చట్టం, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల ప్రకారం స్టేట్ కౌన్సిల్ ఆమోదంతో అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ఏప్రిల్ 10 మొదలు అదనపు సుంకాలు విధిస్తున్నాం అని ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ టారిఫ్ కమిషన్ వెల్లడించింది. ఈ కొత్త నిర్ణయంతో ప్రస్తుతం అమెరికా నుంచి దిగుమతులపై ఉన్న పన్నులకు అదనంగా ఈ టారిఫ్‌లు కూడా విధించనున్నారు. కానీ, ఇప్పటికే అమల్లో ఉన్న పన్ను, ఇతర మినహాయింపు పాలసీలు కూడా కొనసాగనున్నాయి. మార్గం మధ్యలో ఉన్న సరకులు మే 13లోపు చేరుకొంటే.. వాటికి మాత్రం మినహాయింపు లభించనుంది.
సుమారు 438 బిలియన్ డాలర్ల వస్తువులు ఎగుమతి
కాగా, నిన్న ట్రంప్ 34శాతం అదనపు సుంకాలను విధించడంపై బీజింగ్ తీవ్రంగా స్పందించింది. తాము తగిన విధంగా ప్రతిస్పందిస్తామని పేర్కొంది. చైనా నుంచి అమెరికాకు ఏటా సుమారు 438 బిలియన్ డాలర్ల వస్తువులు ఎగుమతి అవుతుంటాయి. ఇక, అమెరికాతో వాణిజ్య చర్చలపై చైనా స్పందిస్తూ.. తాము వాణిజ్య ఆందోళనలపై వాషింగ్టన్‌తో టచ్‌లో ఉన్నామని చెప్పారు. సమ హోదాలో చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకొంటామని బీజింగ్ వెల్లడించింది.