ట్యాబ్లెట్ వేసుకోవడంతో చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించింది
అల్లూరి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మారేడుమిల్లి మండలం తాడేపల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో నాలుగేళ్ల చిన్నారి రస్మిత అనుకోని విధంగా మృతి చెందింది. నులిపురుగుల నివారణ కోసం ఇచ్చే ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. సాధారణంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా పిల్లలకు నులిపురుగుల నివారణ ట్యాబ్లెట్ అందిస్తారు. అయితే అన్నం తిన్న వెంటనే ట్యాబ్లెట్ వేసుకోవడంతో చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించింది. తల్లిదండ్రులు తక్షణమే ఆమెను ఏరియా ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతిచెందింది.

ఈ ఘటనతో చిన్నారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ట్యాబ్లెట్ ఇచ్చే ముందు పిల్లల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించడం, సరిగ్గా తీసుకోవాల్సిన సమయం గురించి అవగాహన కల్పించడం కీలకమని డాక్టర్స్ అంటున్నారు. చిన్నారి మృతికి కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారుల నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన రాలేదు. పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.