హైదరాబాద్‌లో రేపు (జనవరి 30) చికెన్, మటన్ షాపులు బంద్ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలో గాంధీ జయంతి రోజున మాత్రమే ఈ షాపులను మూసివేసే ప్రథా ఉండేది. కానీ ఈసారి గాంధీ వర్ధంతి రోజున కూడా ఇదే నియమాన్ని పాటించాలని అధికారుల నిర్ణయం తీసుకున్నారు.
గాంధీ వర్ధంతి సందర్భంగా అహింసా సిద్దాంతాన్ని పాటించేందుకు మాంసం అమ్మకాలను నిలిపివేయాలని ప్రభుత్వం సూచించింది. గొర్రెలు, మేకల మండీలను కూడా మూసివేయాలని, ఎవరైనా ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఇది పూర్తిగా నైతిక మరియు సామాజిక అంశాలతో కూడిన నిర్ణయమని, ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు. నగరంలోని అన్ని మాంసం విక్రయ దుకాణాలపై నిఘా ఉంచనున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మహాత్మా గాంధీ అహింస సిద్ధాంతానికి కట్టుబడి ఉండే వ్యక్తి. ఆయన్ను స్మరించుకునే రోజుల్లో హింసకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా గాంధీ జయంతి, వర్ధంతి రోజున ఈ ఆంక్షలు అమలవుతాయని పేర్కొన్నారు.
ఈ మేరకు మాంసం వ్యాపారులు, ప్రజలు అధికారులు సూచనలను గౌరవించాలని, ప్రభుత్వ నిర్ణయానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రేపటితో పాటు భవిష్యత్తులో ఇలాంటి రోజుల్లో మాంసం విక్రయాలను నిలిపివేయాలని ప్రభుత్వ పాలసీ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.