గర్భసంచి లేదా గర్భాశయం అనేది ఒక మహిళ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. ఇది గర్భధారణకు, నెలసరి చక్రానికి కేంద్ర బిందువుగా ఉంటుంది. గర్భసంచి సహాయంతోనే గర్భం దాల్చడం, శిశువు అభివృద్ధి చెందడం జరుగుతుంది. అయితే ఇటీవలి కాలంలో, కొన్ని కారణాల వల్ల మహిళలు గర్భసంచిని తొలగించుకునే శస్త్రచికిత్స (హిస్టరెక్టమీ)కు దారిపడుతున్నారు.
గర్భసంచి తొలగింపు
ఏప్రిల్ 7 – వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఒక కీలక ఆరోగ్య సమస్యపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గర్భసంచిని తొలగించుకునే శస్త్రచికిత్సలు ఇటీవల ఎక్కువగా నమోదవుతున్నాయి. చాలామంది మహిళలు తెలిసో తెలియకో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, తక్కువ విద్యా స్థాయి కలిగిన మహిళలు డాక్టర్ల మాటలను బలంగా నమ్మి గర్భాశయాన్ని తొలగించుకుంటున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) 2019–2021 గణాంకాల ప్రకారం- తెలంగాణలో 8.2% మహిళలు
గర్భసంచి తొలగించుకున్నట్లు వెల్లడైంది. ఇది దేశ సగటు 3.3% కన్నా రెండున్నర రెట్లు ఎక్కువగా ఉంది.
సాధారణంగా ఇది 40–49 సంవత్సరాల మహిళల్లో అధికంగా కనిపిస్తుంది, కానీ 30–39 వయస్సు వారిలో కూడా 3.3% ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 8.7% మహిళలు

గర్భసంచి తొలగింపు అవసరమయ్యే పరిస్థితులు
నిపుణులు చెబుతున్నట్లు, కొన్ని ప్రత్యేక వైద్య కారణాల వల్ల మాత్రమే గర్భసంచి తొలగింపు అనేది చేయాలి- గర్భాశయంలో భారీగా రక్తస్రావం, ఫైబ్రాయిడ్స్ లేదా ట్యూమర్లు, కేన్సర్, ఎండోమెట్రియోసిస్, గర్భసంచి తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఈ పరిస్థితుల్లో తప్ప, ఇతర సందర్భాల్లో గర్భసంచిని తొలగించడం అనేది శరీరానికి పెద్ద భారం.
గర్భసంచిని తొలగిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయంటే?
గర్భం దాల్చే అవకాశం శాశ్వతంగా కోల్పోతారు
ఈ శస్త్రచికిత్స తరువాత, పిల్లలు కలగడం అసాధ్యం అవుతుంది. రుతుక్రమం పూర్తిగా ఆగిపోతుంది నెలసరి చక్రం ఆగిపోవడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇవి నెమ్మదిగా మెనోపాజ్ సమయంలో వచ్చే లక్షణాలే అయినా, చిన్న వయసులో ఆగిపోతే ఇవి తీవ్రమవుతాయి.
నిద్రలేమి
రాత్రిపూట శరీరం హార్మోన్ల మార్పులకు స్పందిస్తూ నిద్ర లోపిస్తుంది. మూత్ర సంబంధిత సమస్యలు మూత్రనాళాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు, మూత్రం ఆపుకోలేకపోవడం వంటి ఇబ్బందులు వస్తాయి.
చర్మం, జుట్టులో మార్పులు
చర్మం పొడిబారడం, జుట్టు పలుచబడు లక్షణాలుగా ఉంటాయి. ఎముకల బలహీనత (ఆస్టియోపోరోసిస్) ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి కావడం వల్ల ఎముకలు బలహీనపడి పగిలే ప్రమాదం ఉంటుంది.
గుండె సంబంధిత సమస్యలు
హార్మోన్ల లోపం గుండె వ్యాధుల రిస్క్‌ను పెంచుతుంది. డిప్రెషన్, ఆందోళన, భావోద్వేగ అస్థిరత వంటి మానసిక సమస్యలు ఎదురవుతాయి. శరీర జీవక్రియ నెమ్మదిగా మారుతుంది, బరువు పెరిగే అవకాశం ఉంటుంది. గర్భసంచిని తొలగించడం అన్నది ఒక చిన్న విషయం కాదు. ఇది మహిళ జీవితంపై శారీరకంగా, మానసికంగా, భావోద్వేగంగా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ప్రతి మహిళ, ప్రతి కుటుంబం, ప్రతి వైద్యుడు దీన్ని బాధ్యతగా పరిగణించాలి. తాత్కాలిక ఉపశమనం కోసం శాశ్వతంగా జీవితాన్ని మారుస్తే అది ప్రమాదమే.
Read also: Coconut water: షుగర్ వ్యాధిగ్రస్తులు కొబ్బరి నీళ్లు తాగొచ్చా?