విజయవాడ నగరంలో షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ లలో వాహనదారులపై వసూలు చేస్తున్న పార్కింగ్ ఫీజులపై మున్సిపల్ కమిషనర్ థ్యాన్ చంద్ర కఠిన చర్యలకు పూనుకున్నారు. ప్రభుత్వం నుండి వచ్చిన ఉత్తర్వులను అనుసరిస్తూ ఆయన స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు. పార్కింగ్ ఫీజుల పేరుతో ప్రజలను మోసం చేయడం ఇక జరగదని ఆయన హెచ్చరించారు.
మొదటి అరగంట వరకు ఎటువంటి ఫీజు వసూలు చేయకూడదు
ఆదేశాల ప్రకారం, షాపింగ్ మాల్స్ లోకి వచ్చిన వాహనదారుల నుండి మొదటి అరగంట వరకు ఎటువంటి ఫీజు వసూలు చేయకూడదు. అరగంట మించి ఒక గంట లోపు పార్క్ చేసిన వారు మాల్ లో షాపింగ్ చేసినట్లు లేదా సినిమా చూసినట్లు బిల్ లేదా టికెట్ చూపిస్తే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని కమిషనర్ వెల్లడించారు. ఇదే విధంగా, గంటకు పైగా వాహనం నిలిపిన వారు కూడా రుజువుతో కూడిన బిల్ చూపిస్తే పార్కింగ్ ఫీజు నుంచి మినహాయింపును పొందవచ్చన్నారు.

మల్టీప్లెక్స్ లలో వాహనదారులపై జరుగుతున్న దోపిడీకి చెక్
ఈ ఆదేశాల వల్ల నగరంలోని మాల్స్, మల్టీప్లెక్స్ లలో వాహనదారులపై జరుగుతున్న దోపిడీకి చెక్ పడనుందని భావిస్తున్నారు. గతంలో ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కొన్ని మాల్స్ వాటిని అమలు చేయకపోవడంతో ఈసారి కమిషనర్ ప్రత్యేకంగా ఈ విషయంపై చర్యలు తీసుకున్నారు. ఈ కొత్త విధానంతో వినియోగదారుల హక్కులు కాపాడబడతాయని, మాల్ నిర్వాహకులు నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.