ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన డేటా లీక్ (Data Leak) ఘటనలో దాదాపు 1,600 కోట్ల సోషల్ మీడియా అకౌంట్ల లాగిన్ డేటా హ్యాక్ అయినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) దేశ ప్రజలను అప్రమత్తం చేస్తూ కీలక సూచనలు చేసింది. సోషల్ మీడియా వినియోగదారులు తమ అకౌంట్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని హెచ్చరించింది.
వెంటనే పాస్వర్డ్లు మార్చుకోవాలి
ఈ భారీ హ్యాకింగ్ ఘటనలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గ్మెయిల్, లింక్డిన్, టెలిగ్రామ్ వంటి ప్రముఖ సామాజిక మాధ్యమాల అకౌంట్లు లక్ష్యంగా అయ్యే అవకాశం ఉందని సర్ట్-ఇన్ పేర్కొంది. డేటా దొంగిలింపు ప్రమాదాన్ని నివారించేందుకు వెంటనే మీ అకౌంట్ల పాస్వర్డ్లు మార్చుకోవాలని, బలమైన పాస్వర్డ్లు ఉపయోగించాలని సూచించింది. అంతేకాకుండా ఒకే పాస్‌వర్డ్‌ను అనేక అకౌంట్లకు ఉపయోగించకుండా ఉండాలని, టూ-స్టెప్ వెరిఫికేషన్‌ను తప్పనిసరిగా యాక్టివేట్ చేయాలని కోరింది.
సిస్టమ్ అప్డేట్స్ తప్పనిసరి
కేవలం పాస్వర్డ్ మార్పే కాకుండా, మీ మొబైల్ ఫోన్లు, ల్యాప్టాపులు, కంప్యూటర్లు లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేయడం కూడా భద్రత పరంగా చాలా ముఖ్యం అని సూచించింది. సాఫ్ట్వేర్లు, బ్రౌజర్లను కూడా రీసెంట్ వెర్షన్లకు నవీకరించాలి. ఫిషింగ్ ఇమెయిళ్లకు, అనుమానాస్పద లింకులకు దూరంగా ఉండాలని, గుర్తు తెలియని డౌన్లోడ్లను చేయవద్దని సూచించింది. సైబర్ ముప్పుల నుంచి మీ డేటాను కాపాడుకోవడం ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని సర్ట్-ఇన్ స్పష్టం చేసింది.
Read Also : Cabinet :కొత్త తరానికి ఎమర్జెన్సీ గురించి తెలియాలి.. కేంద్ర కేబినెట్