ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రతి నియోజకవర్గంలో 100 పడకల నుంచి 300 పడకల సామర్థ్యం కలిగిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయం ఆరోగ్య రంగాన్ని ఒక కొత్త దిశగా తీసుకెళ్తుంది.

ప్రస్తుతం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 100 పడకలకు పైగా ఆసుపత్రులు ఉన్నవి కేవలం 70 నియోజకవర్గాలకే పరిమితం. మిగిలిన 105 నియోజకవర్గాల్లో త్వరితగతిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు. దీనికోసం స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
పీపీపీ విధానంలో ఆసుపత్రుల నిర్మాణం
ప్రభుత్వ నిధులతో పాటు ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఆసుపత్రులను నిర్మించి, నిర్వహించే విధానాన్ని చేపట్టాలనేది చంద్రబాబు అభిప్రాయం. ప్రైవేట్ సంస్థలకు పరిశ్రమల తరహాలో సబ్సిడీలు, భూకట్టడాలు, పన్ను మినహాయింపులు వంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రతిపాదించారు. అమరావతిని ప్రపంచ స్థాయి మెడికల్ హబ్గా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ఒక మెగా ప్రాజెక్ట్ – గ్లోబల్ మెడిసిటీ పై దృష్టిసారించారు. ఈ మెడిసిటీ ద్వారా విదేశాల నుండి రోగులు వైద్యం కోసం అమరావతికి రావాలనుకునేలా పర్యాటనతో పాటు వైద్య రంగం కూడ అభివృద్ధి చెందుతుంది.
విద్య-వైద్య రంగాల ప్రాధాన్యత
తన పాలనలో విద్యా మరియు వైద్య రంగాలు అత్యున్నత ప్రాధాన్యత కలిగినవి అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం బాగుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో సేవలందిస్తున్న బిల్ & మిలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలోని వైద్య రంగాన్ని అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. వీరి సహకారంతో డిజిటల్ హెల్త్ ఇనిషియేటివ్స్, ప్రాథమిక వైద్య సేవల విస్తరణ జరగనున్నది.
వర్చువల్ వైద్య సేవలు
పల్లె ప్రాంతాల్లో డాక్టర్లు అందుబాటులో లేకపోతే, పీహెచ్‌సీ (PHC), సీహెచ్‌సీ (CHC)లలో వర్చువల్ మోడ్ ద్వారా ప్రాథమిక వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. దీనివల్ల గ్రామీణ ప్రజలు చిన్నపాటి అనారోగ్యానికి పెద్ద దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. అనారోగ్యం వచ్చిన తరువాత వైద్యం చేయడం కన్నా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రజలను ఆరోగ్యంగా ఉంచడంపై చంద్రబాబు ప్రాధాన్యత చూపించారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చుకోవడం ద్వారా డయాబెటిస్, బిపి, గుండె వ్యాధులు లాంటి సమస్యల్ని నివారించవచ్చని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రక్రియను మరింత వేగంగా తీసుకెళ్లాలని సీఎం సమీక్షలో స్పష్టం చేశారు. క్యాన్సర్ మొదటి దశలోనే గుర్తిస్తే చికిత్స విజయవంతం అవుతుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయాలన్నింటి వెనుక ఉన్న చంద్రబాబు దృష్టికోణం ఎంతో స్పష్టమైనది — రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి సరసమైన ధరలో, సమీపంలో, సమర్థవంతమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం. ఇటీవలి కాలంలో కరోనా మహమ్మారి తర్వాత ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం అత్యంత అవసరమైంది.