ఫిబ్రవరి అనగానే మధ్యతరగతి వేతన జీవులు అందరికీ గుర్తుకు వచ్చేది కేంద్ర బడ్జెట్. ఆ మాటకొస్తే వేతన జీవులకే కాదు.. దేశంలోని ప్రతి ఒక్కరిపైనా బడ్జెట్ ప్రభావం ఉంటుంది. ఈ క్రమంలోనే కేంద్ర బడ్జె్ట్ 2025పై ఇప్పుడు అందరి ఆసక్తి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈసారి కేంద్ర బడ్జెట్ మీద, కేంద్ర ప్రభుత్వం మీద భారీగా ఆశలు పెట్టుకుంది. ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి భారీగా సహకారం అవసరం. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఈసారి నాయుడి గారి మాట నెగ్గుతుందా? కేంద్ర బడ్జెట్ 2025లో ఏపీకి ప్రాధాన్యం ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.
![](https://vaartha.com/wp-content/uploads/2025/01/budge-1024x576.jpg.webp)
2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ఫ్రెమ్ మారిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరపతి బాగా పెరిగింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీ బీజేపీకి రాని నేపథ్యంలో.. ఆ పార్టీ ఇతర ఎన్డీఏ పక్షాలపై ఆధారపడుతోంది. బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని ఆర్జేడీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ మద్దతుతో కేంద్రంలో ఎన్డీఏ కూటమి సర్కారు కొలువు దీరింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ 2025లో ఏపీకి ప్రాధాన్యం ఎంతమేరకు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
2024 బడ్జెట్ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం రూ.15 వేల కోట్లు కేటాయించింది. ప్రపంచబ్యాంకు ద్వారా ఈ రుణాన్ని అందిస్తామని తెలిపింది. అలాగే ఆర్థిక లోటును భర్తీ చేయడానికి ఏడు వేల కోట్లు, అమరావతి నిర్మాణానికి రూ.50000 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 12 వేల కోట్లు, అప్పులు తీర్చేందుకు ఇలా లక్ష కోట్లు వరకూ ఇవ్వాలని జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా చంద్రబాబు ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే.