వైసీపీ అధ్యక్షుడు జగన్ మోసపూరిత రాజకీయాలు (Jagan’s deceitful politics) చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. సాక్షి పత్రిక, సాక్షి టీవీ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. సాక్షి మీడియాను నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే అవుతుందని చంద్రబాబు (Chandrababu Naidu) ఎద్దేవా చేశారు.ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పై వ్యక్తిత్వహనన వ్యాఖ్యలు చేసిన వారిని ప్రోత్సహించడం జగన్ తప్పు అని చంద్రబాబు అన్నారు. పార్టీ అధినేతగా ఆయన తన నాయకులను క్రమశిక్షణలో ఉంచాలని సూచించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై కూడా వైసీపీ తప్పుడు కథనాలు సృష్టించిందని ఆయన గుర్తుచేశారు.బంగారుపాళ్యం పర్యటన దృశ్యాలను నెల్లూరు పర్యటనతో కలిపి భారీ జనసంద్రం ఉన్నట్టు చూపించడం ప్రజలను మోసం చేయడమేనని చంద్రబాబు విమర్శించారు. ఇలాంటి జిమ్మిక్కులు ఇక సహించబోమని హెచ్చరించారు.

చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం
చేనేతలకు పెద్ద శుభవార్త చెబుతూ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం ప్రకటించారు. పవర్ లూమ్ యజమానులకు 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్ ఉన్న వారికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని తెలిపారు. ఈ పథకం ఈనెల 7న అంతర్జాతీయ చేనేత దినోత్సవం నాటికి అమల్లోకి వస్తుందని చెప్పారు.కడప స్టీల్ ప్లాంట్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు. జిందాల్ సంస్థ రూ.4,500 కోట్లతో తొలి దశ, రూ.11,850 కోట్లతో రెండో దశ పనులు చేపడుతుందని వివరించారు. 2029 నాటికి ఉత్పత్తి మొదలవుతుందని తెలిపారు. గండికోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి రూ.80 కోట్లతో పనులు జరుగుతున్నాయని చెప్పారు.
సీమ పారిశ్రామికాభివృద్ధికి రోడ్‌మ్యాప్
సీమలో పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామని చంద్రబాబు తెలిపారు. ఆటోమొబైల్, స్పేస్, డిఫెన్స్, ఏరోస్పేస్, డ్రోన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ప్రాజెక్టులను తీసుకువచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్ల కోసం రూ.5,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వెల్లడించారు.రైతులకు వాగ్దానం చేసినట్టే ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద రేపటినుంచి డబ్బు జమ అవుతుందని చంద్రబాబు తెలిపారు. ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం అందుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, కేంద్రం రూ.2 వేల సహాయం కలిపి రైతులకు డబ్బు అందజేస్తామని స్పష్టం చేశారు.
Read Also : Pension Distribution : పింఛన్ పంపిణీలో సీఎం చంద్రబాబు సరికొత్త పంథా