ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘనవిజయం తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ విజయాన్ని ఆయన చారిత్రాత్మకంగా పేర్కొంటూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బలమైన నాయకత్వం, స్థిరమైన పాలన ఫలితంగా సాధ్యమైందన్నారు. ఇది కేవలం బీజేపీకే కాకుండా, మొత్తం దేశానికి గర్వించదగిన విషయం అని అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ పాలనపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. మద్యం వ్యాపారంపై మార్పులు చేయడం ద్వారా వారు ఆర్థిక లాభం పొందారని ఆరోపించారు. “మద్యం మాఫియాను నడిపించి ప్రజా ఆరోగ్యాన్ని పణంగా పెట్టారు. కుటుంబాల బాగోగులు కంటే స్వప్రయోజనాలను ప్రాధాన్యమిచ్చారు. ప్రజలను మద్యం అలవాటులోకి దింపి, ఆ డబ్బుతో తమ స్వార్థ ప్రయోజనాలు సాధించారు” అని తీవ్రస్థాయిలో విమర్శించారు.
రుషికొండ పర్వత ప్రాంతంలో నిర్మాణాల గురించి మాట్లాడుతూ, “ఋషులు ధ్యానం చేసిన పవిత్ర భూమిలో రాజభవనాలు కట్టారు. ఢిల్లీలోనూ శీష్ మహల్ నిర్మించారు. అయినప్పటికీ, ఆ భవనాలలోకి అడుగుపెట్టే పరిస్థితి కూడా వారికి రాలేదు. పైగా, ₹10 లక్షల కోట్ల రుణభారం మోపారు” అని అన్నారు. పాలన అంటే విధ్వంసం సృష్టించడం కాదని, అది నిర్మాణాత్మకంగా సాగాలని సూచించారు.
తన అరెస్టును ప్రస్తావిస్తూ, “నా అరెస్టుకు వ్యతిరేకంగా 60 దేశాల్లో నిరసనలు జరిగాయి. తెలంగాణలోనూ ప్రజలు ఆందోళన చేశారు, కానీ అక్కడి ప్రభుత్వం నిరసనలను అణచివేయడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ, ప్రజలు ఎంతటి చైతన్యంతో ఉన్నారో ప్రపంచం చూసింది” అని వ్యాఖ్యానించారు.
తన పాలనా శైలిపై వచ్చిన విమర్శలకు బదులిస్తూ, “పరిపాలనలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలి అని నేను నా మంత్రులకు సూచిస్తున్నాను. అయితే, నా మాటలను వక్రీకరించి, వాట్సాప్ పాలన అంటూ అపహాస్యం చేస్తున్నారు. ప్రజల సమస్యలపై దృష్టి సారించకుండా, అసత్య ప్రచారాలతో వారికి తప్పుదారి పట్టిస్తున్నారు” అని ఆయన ధ్వజమెత్తారు.