హైదరాబాద్ మెట్రో రైల్ రెండవ దశ (Metro Phase-2) ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు (Sridhaarbabu) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలోనూ మెట్రో ప్రాజెక్టును ప్రస్తావించకపోవడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధికి అనుకూలంగా ఉండాల్సిన కేంద్రం, ఇటువంటి కీలక అంశాలను విస్మరించడమంటే నిర్లక్ష్య ధోరణి అని విమర్శించారు.
పుణేకు అనుకూలత.. తెలంగాణకు అన్యాయం
మహారాష్ట్రలోని పుణే మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం త్వరగా ఆమోదం తెలపడం, అదే సమయంలో హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ను పట్టించుకోకపోవడం కేంద్ర ప్రభుత్వ దురుద్దేశం స్పష్టంగా తెలియజేస్తోందని శ్రీధర్ బాబు తెలిపారు. నగర వృద్ధిలో భాగంగా ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు మెట్రో సేవలు కీలకం కాగా, కేంద్రం వ్యవహరించిన తీరుతో రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ భూములపై రాష్ట్రానికి న్యాయం చేయాలి
అంతేకాకుండా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల భూములు నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని ప్రజావసరాల కోసం వినియోగించేందుకు కేంద్రం సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్రానికి కేంద్రం కూడా సహకారం అందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఒకే దేశంలో అన్ని రాష్ట్రాలకూ సమానంగా వ్యవహరించాల్సిన బాధ్యత కేంద్రానిదని ఆయన అన్నారు.
Read Also : MP Raghunandan Rao : ఇరిగేషన్ అధికారులపై ఎంపీ రఘునందన్ రావు ఫైర్