Adilabad Airport : భారత వాయుసేన ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పౌర విమాన సేవలను ప్రారంభించేందకు అనుమతులు మంజూరు చేసింది. ఆరు నెలల వ్యవధిలోనే రెండు ఎయిర్ పోర్టులకు అనుమతులు రావడం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవిశ్రాంత కృషికి దక్కిన ఫలితమని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ ఎయిర్ పోర్టును అభివృద్ధి చేసి పౌర విమానయాన సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి భారత వాయుసేన అంగీకరించింది.

వాయుసేన శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు
త్వరలోనే అక్కడ వాయుసేన శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ గా అభివృద్ధి చేయాలని వాయుసేన లేఖ ద్వారా సూచించిందని కోమటిరెడ్డి తెలిపారు. రన్ వే పునర్నిర్మాణ , పౌర టర్మినల్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ ఎప్రాన్ సహా మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సి ఉందని కోమటిరెడ్డి తెలిపారు. వీటికి అవసరమైన భూమిని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఇవ్వాలని వాయుసేన సూచించినట్లు చెప్పారు. ఈ విషయంపై అధికారులతో సమీక్షిస్తున్నామని…త్వరలోనే అన్ని వివరాలతో కూడిన నివేదికను కేంద్రానికి పంపిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.