ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్‌కు గట్టి షాక్ ఇచ్చేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో చోటు చేసుకున్న అనేక వివాదాస్పద అంశాల్లో మద్యం స్కాం ఒకటిగా మారింది. మద్యనిషేధం పేరుతో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రముఖ బ్రాండ్లను తొలగించి, సొంత కంపెనీల ద్వారా నాసిరకం మద్యం విక్రయించిందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో వేల కోట్లు విదేశాలకు మళ్లినట్లు ప్రచారం సాగుతుండగా, చంద్రబాబు ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లే పనిలో ఉన్నారు.
రూ. 4,000 కోట్లు దుబాయ్, ఆఫ్రికా దేశాలకు తరలింపు
ఇటీవల పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఈ స్కాంపై గళమెత్తారు. దాదాపు రూ. 4,000 కోట్లు దుబాయ్, ఆఫ్రికా దేశాలకు తరలించారని, దీనిపై కేంద్రం వెంటనే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఫలితంగా, మద్యం కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయి. అంతేకాక, విదేశాలకు డబ్బులు మళ్లించడంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా రంగంలోకి దిగే అవకాశముందని సమాచారం.

వందల కోట్ల రూపాయలు జగన్‌కు చేరాయనే ఆరోపణ
ఈ స్కాంలో మాజీ వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి పాత్ర ఉందన్న ఆరోపణలు తెరపైకొస్తున్నాయి. సీబీఐ దర్యాప్తు మొదలైతే ఈ వ్యవహారం మరింత పెరిగే అవకాశముంది. ముఖ్యంగా, ఈ స్కాంలో వందల కోట్ల రూపాయలు చివరకు వైసీపీ అధినేత జగన్‌కు చేరాయనే ఆరోపణలను ప్రభుత్వం నిరూపించే ప్రయత్నంలో ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో వైసీపీకి రాజకీయంగా పెద్ద దెబ్బ తగలనుందని, ఈ దర్యాప్తు జగన్ భవిష్యత్తుపై ప్రభావం చూపించే అవకాశముందని అంటున్నారు. ప్రస్తుతం టీడీపీ వ్యూహంలో ఈ అంశం ప్రధానంగా మారినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.