Oracle Jobs : ఐటీ రంగంలో సంక్షోభం మరింత తీవ్రమవుతోంది. తాజాగా ఒరాకిల్ భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు అమలు చేస్తోంది. వివిధ దేశాల్లో 3 వేల మందికి పైగా ఉద్యోగులను (Oracle Jobs) తొలగించేందుకు సంస్థ సిద్ధమైంది. అమెరికా, భారతదేశం, ఫిలిప్పీన్స్, కెనడా, యూరప్ వంటి ప్రాంతాల్లో ఈ కోతలు ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఒరాకిల్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (OCI), హెల్త్ (సెర్నర్), ఆర్కిటెక్చర్, కార్పొరేట్ విభాగాల్లో ఉద్యోగులు పెద్ద ఎత్తున దెబ్బతిన్నారు.
అమెరికాలో హెల్త్ విభాగం, కన్సల్టింగ్ రంగాల్లో కోతలు జరిగాయి. వాషింగ్టన్ రాష్ట్రంలో 161, సియాటిల్‌లో 101 ఉద్యోగాలు ఊడిపోయాయి. భారతదేశంలో టెక్నాలజీ, సపోర్ట్ విభాగాల ఉద్యోగులు ప్రభావితమయ్యారు. అయితే సంస్థ అధికారికంగా ప్రకటన చేయకపోయినా, పరిశ్రమ నివేదికలు ప్రపంచవ్యాప్తంగా 3 వేల మందికి పైగా ఉద్యోగాలు ఊడిపోయాయని చెబుతున్నాయి.
ఒరాకిల్ 2022లో సెర్నర్‌ను కొనుగోలు చేసి హెల్త్ ఐటీని వ్యూహంలో భాగం చేసుకున్నా, ఇప్పుడు వ్యాపార ప్రాధాన్యతలు మారుతున్నాయని ఈ కోతలు సూచిస్తున్నాయి. AI ఆధారిత టెక్నాలజీల వేగవంతమైన అభివృద్ధి, ఆర్థిక మందగమనం, వ్యయ నియంత్రణ కారణంగా మానవ ఆధారిత పనులు తగ్గిపోతున్నాయి.
ఒరాకిల్ మాత్రమే కాకుండా గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్ వంటి టెక్ దిగ్గజాలు కూడా ఇదే దారిలో సాగుతున్నాయి. Layoffs.fyi నివేదిక ప్రకారం ఇప్పటి వరకు 83 వేల మంది టెక్ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. ఇది పరిశ్రమలో తీవ్ర అస్థిరతను సూచిస్తోంది. AI ప్రాధాన్యత పెరుగుతుండటంతో కొత్తగా ఉన్న ఎంట్రీ లెవల్, మిడ్ లెవల్ ఉద్యోగాలు మరింత ప్రమాదంలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
Read also :