లాస్ ఏంజెల్స్ : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కి చెందిన అంతర్జాతీయ హోటల్ భవనం ఎదుట బుధవారం పేలుడు జరిగింది. టెస్లా కారులో పేలుడు సంభవించింది. కారులో అమర్చిన పేలుడు పదార్థం పేలిందని, ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించగా, ఏడుగురికి స్వల్ప గాయాలైనట్లు లాస్ వెగాస్ షెరిఫ్ మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని అన్నారు.
హోటల్ భవనం ఎదుట ఎలక్ట్రిక్ కారులో మంటలు వస్తున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. పేలుడు ఘటనపై అధ్యక్షుడు బైడెన్ స్పందించినట్లు వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులకు ఆదేశించినట్లు వెల్లడించింది. న్యూఆర్లీన్స్‌లోని కెనాల్, బోర్బన్ వీధిలో న్యూ ఇయర్ వేడుకలపై దుండగుడు కారుతో తొక్కించిన ఘటన మరువక ముందే ఈ ఘటన జరిగింది. కారుతో వీలైనంత మందిని తొక్కించడంతో పాటు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.
మరోవైపు పేలుడు ఘటనపై టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది ఉగ్ర చర్యగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. సైబర్ ట్రక్ లో అమర్చిన పేలుడు పదార్థం లేదా బాంబ్ కారణంగా పేలుడు సంభవించిందని ఆయన అన్నారు. టెస్లా సీనియర్ టీమ్ దీనిపై దర్యాప్తు చేస్తోందని తెలిపారు. దర్యాప్తులో తేలే విషయాలను అందరితో పంచుకుంటామని చెప్పారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనను చూడలేదని అన్నారు. పేలుడుకు కారణమైన కారును అద్దెకు తీసుకున్నారని చెప్పారు. ఈ ఘటన పేలుడు పదార్థాల కారణంగా సంభవించిందని… టెస్లా కారు వల్ల జరగలేదని ఆయన పేర్కొన్నారు.