కెనడాలో 2025లో జరిగిన ఫెడరల్ ఎన్నికల్లో మరోమారు లిబరల్ పార్టీ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ అధినేత మార్క్ కార్నీ మరోసారి ప్రధన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ (Anita Anand) ను దేశ విదేశాంగ మంత్రిగా నియమించారు. ఇది కెనడియన్ రాజకీయాల్లో భారత్ డయాస్పోరాను ప్రతిబింబిస్తుంది. భారత్ మూలాలు కలిగిన అనితా ఆనంద్.. మెలానీ జోలీ స్థానంలో కెనడా విదేశాంగ మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించారు. గతంలో మెలానీ జోలీ ఆశాఖ బాధ్యతలు నిర్వహించారు. అనితా అనంద్ (Anita Anand) గతంలో రక్షణ మంత్రిగా పనిచేశారు. అలాగే ఇతర కీలక మంత్రిత్వ శాఖలను కూడా నిర్వహించారు. అనితా ఆనంద్ (Anita Anand) నియామకంతో భారత సంతతికి చెందిన కెనడియన్లు ఆ దేశ ప్రభుత్వంలో కీలక పాత్రలు పోషించే పరంపర కొనసాగినట్లైంది.
భారత మూలాల గౌరవప్రద ప్రతినిధిగా
కెనడా లిబరల్ పార్టీకి చెందిన సీనియర్ సభ్యురాలు అనితా ఆనంద్ (Anita Anand) (58) ప్రమాణ స్వీకార సమయంలో హిందూ గ్రంథం భగవద్గీతపై తన చేతిని ఉంచి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సంప్రదాయాన్ని ఆమె మునుపటి క్యాబినెట్ నియామకాలలో కూడా అనుసరించారు. ప్రమాణ స్వీకారం అనందరం అనితా ఆనంద్ (Anita Anand) ట్వీట్‌చేశారు. అందులో కెనడా విదేశాంగ మంత్రిగా ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నాను. కెనడియన్లకు సురక్షితమైన, న్యాయమైన ప్రపంచాన్ని నిర్మించడానికి, అందించడానికి ప్రధాన మంత్రి మార్క్ కార్నీ మా బృందంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ పోస్టులో పేర్కొన్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ కమ్యూనిటీ, డయాస్పోరా వారు ఈ నియామకాన్ని గర్వంగా భావిస్తున్నారు.

విద్యాబ్యాసం & వృత్తి జీవితం
తమిళ, పంజాబీ మూలాలున్న అనితా ఆనంద్(Anita Anand) కెనడాలోని నోవాస్కోటియాలోని కెంట్‌విల్లేలో 1967 మే 20ర జన్మించారు. తల్లి సరోజ్ దౌలత్‌రామ్ అనస్తీషియాలజిస్ట్. తండ్రి సుందరం వివేక్ జనరల్ సర్జన్. తల్లి పంజాబ్ కాగా, తండ్రి తమిళనాడు వాసులు. ఈ దంపతుల ముగ్గురు సంతానంలో పెద్దమ్మాయి అనిత. ఈమెకు గీత, సోనియా అనే ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. 1985లో 18 ఏళ్ల వయసులో ఆనంద్ ఆనంద్ ఒంటారియోకు వెళ్లారు. అక్కడ ఆమె రాజకీయ శాస్త్రంలో అకడమిక్ డిగ్రీని అభ్యసించారు. ఆ తరువాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (ఆనర్స్) పూర్తి చేశారు. ఆ తర్వాత ఆమె డల్హౌసీ విశ్వవిద్యాలయం, టొరంటో విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. అనంతరం చాలా యేళ్లు లాయర్‌గా అనితా ఆనంద్ కెరీర్ కొనసాగించారు.
వ్యక్తిగత జీవితం
అనితా ఆనంద్.. 1995లో కెనడియన్ న్యాయవాది, వ్యాపార కార్యనిర్వాహకుడు అయిన జాన్ నోల్టన్‌ను వివాహం చేసుకున్నారు. వారికి నలుగురు పిల్లలు. వీరు ప్రస్తుతం ఓక్‌విల్లేలో నివసిస్తున్నారు. 2019లో కెనడా ఫెడరల్ క్యాబినెట్‌లో పనిచేసిన మొదటి హిందూ మహిళగా అనితా ఆనంద్ (Anita Anand) ప్రసిద్ధి చెందారు. 2019 నుంచి 2021 వరకు పబ్లిక్ సర్వీసెస్, ప్రొక్యూర్‌మెంట్ మినిస్టర్‌గా పనిచేశారు. ముఖ్యంగా కెనడా రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో ఉక్రెయిన్‌కు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. సాయుధ దళాల్లో లైంగిక వేధింపుల్ని ఆరికట్టి కొత్త సంస్కరణలు తీసుకొచ్చినందుకుగానూ పలు పురస్కారాలు అందుకున్నారు. ఆమె క్రమశిక్షణ విధానానికిగానూ ప్రశంసలు అందుకున్నారు. అనితా అనంద్ దక్కిన ఈ అరుదైన ఘనతకు కేంద్ర మంత్రి డాక్టర్ జైశంఖర్ తోపాటు పలువురు భారతీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.