BYD: చైనాకు చెందిన దిగ్గజ ఆటోమోటివ్ సంస్థ బీవైడీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే సంస్థ బీవైడీ. హైదరాబాద్ సమీపంలో వాహనాల మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను నెలకొల్పడానికి సన్నాహాలు మొదలు పెట్టనుంది. ఆ సంస్థ యాజమాన్యం, ప్రభుత్వం మధ్య కొంతకాలంగా కొనసాగుతూ వస్తోన్న చర్చలు కొలిక్కి వచ్చాయి. భూ కేటాయింపులు సహా అన్ని రకాలుగా ఆ సంస్థకు రాయితీలను ఇవ్వడానికి ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించింది.

రాష్ట్ర పారిశ్రామిక రంగం కొత్త పుంతలు
ఈ యూనిట్ కోసం హైదరాబాద్ పరిసరాల్లో మూడు ప్రాంతాలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మూడింట్లో ఎక్కడ తమ ఈవీ వాహనాలు, కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పితే బాగుంటుందనే విషయం మీద బీవైడీ ప్రతినిధులు చర్చలు సాగిస్తోన్నారు. ఈ మూడింట్లో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్న తరువాత ప్రభుత్వంతో అధికారిక ఒప్పందం కుదుర్చుకోవాలని బీవైడీ ప్రతినిధులు భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రధానంగా కనెక్టివిటీ గురించి ఆ సంస్థ యాజమాన్యం సమాలోచనలు చేస్తోంది. ఎయిర్, రోడ్, రైలు కనెక్టివిటీ సులభతరంగా ఉండాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే- దేశంలో ఎలక్ట్రిక్ వాహన తయారీ రంగంలో అతిపెద్ద పెట్టుబడుల్లో ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహాలు అక్కర్లేదు. ఇది తెలంగాణ దశ దిశను మార్చుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. రాష్ట్ర పారిశ్రామిక రంగం కొత్త పుంతలు తొక్కుతుందని అంచనా వేస్తోన్నారు.
వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
ఇక, హైదరాబాద్‌లో బీవైడీ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల లభించడం ఖాయమౌతుంది. దీనికి అనుబంధంగా పలు పరిశ్రమలు ఏర్పాటవుతాయి. ఉపాధి అవకాశాలు మరింత విస్తృతమౌతాయి. అటు రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఊతమిచ్చినట్టవుతుంది. ప్రస్తుతం దేశంలో ఎక్కడ కూడా బీవైడీ ఈవీ వాహనాల తయారీ యూనిట్లు లేవు. ఈ కార్లను కొనుగోలు చేయాలంటే చైనా నుంచి భారత్‌కు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దేశీయ మార్కెట్‌లో వాటిని విక్రయిస్తోంది. దిగుమతి పన్నుల వల్ల చైనాతో పోల్చుకుంటే బీవైడీ వాహనాల ధర భారత్‌లో అధికంగా ఉంటోంది.