Vastu : తూర్పు ముఖ ద్వారం (East Face) ఉన్న ఇల్లు ఇది. వాస్తు ప్రకారం చాలా మంది ఈస్ట్ ఫేసింగ్ ఇంట్లోనే ఉంటారు. అయినప్పటికీ కొంతమంది చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటారు. దీనికి కారణమేమై ఉంటుంది?
వాస్తు పరంగా ప్రథమ ప్రాధాన్యం గల గృహం తూర్పు ముఖ ద్వార గృహమే. అందులో సందేహం ఏమీ లేదు. అలాగని వాళ్లకి సమస్యలు, కష్టాలేమీ రావని అనుకోవద్దు. వాస్తు ప్రకారం తూర్పు ముఖద్వారం ఎందుకు ప్రథమ ప్రాధాన్యతలో ఉందంటే- మనకి ఉదయంపూట ఎండ ఆరోగ్య రీత్యా చాలా అవసరం. ఒక తూర్పు ముఖ ద్వారం ఉన్న ఇండిపెండెంట్ హౌస్లోకి ఉదయంపూట ఎండనేరుగా వచ్చేస్తుంది. ఈ సహజ క్రియ అత్యంత ఆరోగ్యవంతమైనది, శుభదాయకం, లక్ష్మీప్రదం.

ఇండిపెండెంట్ హౌస్ కాకుండా, అపార్ట్మెంట్స్ లో ఒక ఫ్లాట్ తీసుకున్నప్పుడు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అంటే పశ్చిమ ముఖద్వారం ఉన్న ఫ్లాట్ని తీసుకుంటేనే మనకు తూర్పు వైపు నుండి ఉదయంపూట ఎండ ఇంట్లోకి వస్తుంది. అలా కాకుండా తూర్పు ముఖ ద్వారం ఉన్న ప్లాట్ని తీసుకున్నట్లయితే దానికి ఎదురుగా పశ్చిమ ముఖ ద్వారం ఉన్న ఫ్లాట్ ఉంటుంది. (అంటే.. కారిడార్ మధ్యలో ఉండి తూర్పు, పశ్చిమ ముఖద్వారాలతో ఇరువైపులా ఫ్లాట్స్ కడుతూ ఉంటారు). అందులో తూర్పు ముఖ ద్వారం ఉన్న ఫ్లాట్ తీసుకుంటే దానికి తూర్పున, పశ్చిమ ముఖ ద్వారం ఉన్న ఫ్లాట్ ఉంటుంది. కాబట్టి ముఖద్వారం తూర్పు అయినప్పటికీ, తూర్పు నుండి ఉదయంపూట ఎండ వచ్చే అవకాశం ఉండదు. వీళ్లకి సాయంత్రంపూట మరోవైపు నుండి తీక్షణమైన ఎండ వస్తుంది.
పాత కాలంలో ఈ అపార్ట్మెంట్ కల్చర్స్ లేవు. అప్పటి వాస్తుకి తూర్పు ముఖ ద్వారమే సరైనదని అనుకోవచ్చు. నిజానికి వాస్తు విషయంలో తూర్పు ముఖ ద్వారాలకు/తూర్పు దిక్కుకు ఎందుకు ప్రాధాన్యం ఇంత ఇచ్చారో తెలుసుకుందాం..

కొన్ని కొన్ని ముఖ ద్వారాలు కొంత మందికి బాగా పనికి వస్తాయి. దక్షిణ ముఖద్వారం పనికొచ్చేవాళ్లు కొంతమంది ఉంటారు. ఉత్తర ముఖద్వారం పనికొచ్చేవాళ్లు కొంతమంది ఉంటారు. పశ్చిమ ముఖద్వారం పనికొచ్చేవాళ్లు కొంతమంది ఉంటారు. వాళ్లు తూర్పు ముఖ ద్వార గృహంలో ఉంటే, వాళ్లకి ఆ తూర్పు ముఖ ద్వార గృహం పెద్దగా హాని చేయదు. ఆ తూర్పు ముఖ ద్వారం ఇంటివాస్తు మామూలుగా బాగున్నప్పటికీ ఏ ముఖద్వారం యోగం వున్నవాళ్లకైనా ఫలితాలు బాగానే ఉంటాయి. చాలావరకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉంటాయి.
కొంతమందికి తూర్పు ముఖద్వారం యోగించే పరిస్థితి ఉంటుంది. అటువంటి వాళ్లకి తూర్పు ముఖద్వార యోగం అద్భుతంగా పని చేస్తుంది. కానీ ఉత్తర ముఖద్వార గృహం పనికొచ్చేవాళ్లు దక్షిణ ముఖద్వారంలో ఉంటే మాత్రం ఫలితాలు విరుద్ధంగా ఉండొచ్చు. దక్షిణ ముఖ ద్వారం బాగా పనికొచ్చేవాళ్లు ఉత్తర ముఖద్వారంలో ఉంటే వాళ్లకి గొప్పగా యోగించదు. కానీ తూర్పు ముఖ ద్వార గృహం కూడా వాళ్లకి బాగానే ఉంటుంది.

Vastu : నాలుగు దిక్కుల్లో కూడా తూర్పు దిక్కుని జ్ఞానానికి ప్రతీకగా పేర్కొంటారు. జ్ఞానానికి, పాండిత్యానికి, మంత్రాంగానికి, వైదిక కర్మలకు, విశేషించి కీర్తి ప్రతిష్టలకు సహకరించటం ఈ దిక్కు ప్రత్యేకత. పైన చెప్పిన వాటినే వృత్తిగా పెట్టుకున్న వాళ్లకు ప్రధానంగా జ్ఞానం, వేదం, వైరాగ్యం, వేదాంతం మొదలైనవన్నీ కావాలి. ఒక అర్చన చేయడం కానీ ఇతరులకు జ్ఞానాన్ని బోధించడం కానీ, మంత్రాంగం నెరపటం కానీ, గొప్ప గొప్ప రాజులకి, వ్యాపారస్తులకు, వ్యక్తిగత సలహాలను ఇవ్వటంలో కానీ.. యుద్ధ, వ్యాపార తంత్రాలలో దేశానికి పనికి వచ్చే సలహాలు ఇవ్వటం కానీ.. ఇదంతా కూడా జ్ఞానంతో కూడిన వ్యవహారం.
అందుకు సంబంధించిన జ్ఞాన సముపార్జన చేయాలని సంకల్పించుకున్న వాళ్లకి తూర్పు ముఖ ద్వార గృహం అద్భుతంగా పనికొస్తుంది. నిజమే! అలాగని ఆ ఇంట్లో సమస్యలు ఏవీ రావని మాత్రం అనుకోకూడదు. సమస్యలు వస్తాయి. కానీ ఆ సమస్యలను కూడా ఎదుర్కోగలిగే శక్తి సామర్థ్యాలు కూడా వీళ్లు కలిగే వుండే తీరుగా ఆ గృహం వీళ్లకి సహకరిస్తుంది. తూర్పు ముఖం ద్వార గృహాల ప్రత్యేకత అదే.! (Vastu)