అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల భారత్ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించారు. ఈ నిర్ణయం ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. భారత్‌లో తయారైన వస్తువులు, ముఖ్యంగా టెక్ ఉత్పత్తులు, అమెరికా మార్కెట్లో గణనీయంగా దెబ్బతిన్నాయి.గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. అందులో భారతదేశం నుంచి అమెరికాకు స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు (Smartphone exports) భారీగా తగ్గాయని తెలిపింది. మే-ఆగస్టు మధ్య ఈ తగ్గుదల రికార్డు స్థాయిలో ఉందని పేర్కొంది.

ఎగుమతుల్లో భారీ పతనం
మే నెలలో భారత్ నుంచి అమెరికాకు 2.29 బిలియన్ డాలర్ల స్మార్ట్‌ఫోన్‌లు ఎగుమతి అయ్యాయి. కానీ ఆగస్టులో ఇది కేవలం 964.8 మిలియన్లకు పడిపోయింది. జూన్‌లో 2 బిలియన్ డాలర్లుగా ఉండగా, జూలైలో 1.52 బిలియన్లకు తగ్గాయి. ఆగస్టు నాటికి మాత్రం గణనీయమైన పతనం చోటుచేసుకుంది.ఈ పరిస్థితిని జీటీఆర్‌ఐ ఆందోళనకరంగా పేర్కొంది. స్మార్ట్‌ఫోన్లపై కొత్త సుంకాలు విధించడం వల్లనే ఈ దిగజారుడు జరిగిందని నివేదికలో స్పష్టం చేసింది. వెంటనే దీనిపై దర్యాప్తు చేయాలని సూచించింది.
సుంకాల పెరుగుదల దెబ్బ
నిపుణుల ప్రకారం, ఆగస్టులో అమెరికా కొన్ని ఉత్పత్తులపై కొత్త సుంకాలు విధించింది. మొదట్లో ఈ సుంకాలు 10 శాతం మాత్రమే ఉండగా, ఆగస్టు 27 నాటికి 25 శాతం పెరిగాయి. ఆగస్టు 28 తర్వాత ఇవి 50 శాతానికి చేరాయి.ఈ సుంకాలు ప్రధానంగా వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, సీఫుడ్, రసాయనాలు, సోలార్ ప్యానెల్స్‌పై విధించబడ్డాయి. కానీ స్మార్ట్‌ఫోన్లపై నేరుగా ప్రభావం లేకపోయినా, మొత్తం ఎగుమతి రంగంపై ప్రతికూల ప్రభావం చూపాయి.
సుంకం లేని ఉత్పత్తులూ పడిపోయాయి
ఆగస్టులో ఎగుమతుల్లో 28.5 శాతం వాటా కలిగిన సుంకం లేని ఉత్పత్తులు కూడా పెద్ద దెబ్బతిన్నాయి. ఈ ఉత్పత్తుల ఎగుమతులు 41.9 శాతం తగ్గాయి. ఇది పరిస్థితి ఎంత క్లిష్టంగా మారిందో స్పష్టంగా చూపిస్తోంది.నిపుణులు చెబుతున్నదేమిటంటే, ఈ కొత్త సుంకాల పూర్తి ప్రభావం సెప్టెంబర్‌లో కనబడుతుంది. అది ఎగుమతుల్లో ఇంకా ఎక్కువ తగ్గుదలకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
కేవలం సుంకాల వల్లనేనా?
జీటీఆర్‌ఐ మాత్రం ఒక కీలక అంశాన్ని కూడా గుర్తించింది. ఎగుమతులు పడిపోవడానికి కేవలం సుంకాలే కారణం కాదని తెలిపింది. వాటి వెనుక మరిన్ని సవాళ్లు ఉండవచ్చని సూచించింది. వాటిపై కూడా సమగ్ర పరిశోధన అవసరమని నిపుణులు చెబుతున్నారు.ఈ పరిణామాలు భారత టెక్ పరిశ్రమకు కొత్త సవాల్‌గా మారాయి. స్మార్ట్‌ఫోన్లతో పాటు ఇతర రంగాలపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ నిలదొక్కుకోవడానికి కొత్త వ్యూహాలు అవసరం అని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Read Also :