విజయవాడ: దేశవ్యాప్తంగా వాహన కొనుగోలుదారులకు ఇది నిజంగా శుభవార్తే. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జీఎస్టీ 2.0(GST) (వస్తు, సేవల పన్ను) సవరణలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త పన్ను విధానంతో కార్లు, ద్విచక్ర వాహనాల(Two-wheelers) ధరలు భారీగా తగ్గాయి. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలన్నీ పన్ను తగ్గింపు ప్రయోజనాలను నేరుగా కస్టమర్లకు బదిలీ చేస్తుండటంతో, వాహన రంగంలో అతిపెద్ద ధరల తగ్గింపు నమోదవుతోంది. సాధారణ ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లపై సుమారు రూ. 40,000 నుంచి మొదలుకొని, ప్రీమియం లగ్జరీ ఎస్‌యూవీలపై ఏకంగా రూ. 30 లక్షల వరకు ధరలు దిగిరావడం విశేషం. దీంతో కొత్త వాహనం కొనాలనుకునే వారికి ఇది సరైన సమయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ద్విచక్ర వాహనాలు, టాటా, మహీంద్రా కార్ల ధరలు తగ్గుదల
భారతదేశంలో దాదాపు 98 శాతం మార్కెట్ వాటా ఉన్న 350సీసీ లోపు స్కూటర్లు, మోటార్‌సైకిళ్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. దీనివల్ల హోండా యాక్టివాపై సుమారు రూ. 7,874, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 వంటి బైక్‌ల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి.
మహీంద్రా తన ఎస్‌యూవీలైన ఎక్స్‌యూవీ 3XO పెట్రోల్ వేరియంట్‌పై రూ.1.40 లక్షలు, స్కార్పియో ఎన్‌పై రూ.1.45 లక్షలు, థార్‌పై రూ.1.35 లక్షల వరకు ధరలు తగ్గించనుంది. టాటా మోటార్స్ కూడా తమ అత్యధికంగా అమ్ముడవుతున్న నెక్సాన్‌పై రూ.1.55 లక్షలు, హారియర్, సఫారీపై రూ.1.45 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది.

మారుతీ సుజుకీ, హ్యుందాయ్, కియా, జపనీస్ బ్రాండ్లపై ఆఫర్లు
సామాన్యుల కారు మారుతీ సుజుకీ(Maruti Suzuki) తన బడ్జెట్ కార్లైన ఆల్టో కె10పై రూ.40,000, స్విఫ్ట్‌పై రూ.58,000, ఇన్విక్టో వంటి లగ్జరీ కార్లపై రూ.2.25 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. హ్యుందాయ్ తన టూసాన్‌పై రూ.2.4 లక్షలు, క్రెటాపై రూ.72 వేల వరకు ధరలు తగ్గించింది. కియా అత్యంత ఖరీదైన ఎంపీవీ కార్నివాల్‌పై రూ.4.48 లక్షల వరకు భారీ తగ్గింపును ప్రకటించింది.
టయోటా తన పాపులర్ ఎస్‌యూవీ ఫార్చ్యూనర్‌పై రూ.3.49 లక్షలు, ఇన్నోవా క్రిస్టాపై రూ.1.80 లక్షల వరకు తగ్గింపు ఇచ్చింది. హోండా అమేజ్, ఎలివేట్ వంటి మోడళ్లపై రూ.95,500 వరకు ప్రయోజనాలు అందిస్తోంది. నిస్సాన్ మాగ్నైట్ ధర రూ.1 లక్ష వరకు తగ్గనుంది.
యూరోపియన్, లగ్జరీ కార్లపై డిస్కౌంట్లు
యూరోపియన్ బ్రాండ్ స్కోడా తన కొడియాక్ మోడల్‌పై జీఎస్టీ తగ్గింపుతో పాటు పండుగ ఆఫర్లను కలిపి మొత్తం రూ.5.8 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇక లగ్జరీ సెగ్మెంట్‌లో రేంజ్ రోవర్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రేంజ్ రోవర్ ఎస్‌వీ ఎల్‌డబ్ల్యూబీ వంటి మోడళ్లపై ఏకంగా రూ.30 లక్షలకు పైగా తగ్గింపు లభించనుంది. డిఫెండర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ మోడళ్లపై రూ.18.6 లక్షల నుంచి రూ.19.7 లక్షల వరకు ప్రయోజనం ఉండనుంది.
కొత్త జీఎస్టీ రేట్లు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి?
కొత్త జీఎస్టీ రేట్లు నేటి నుంచి (సోమవారం) అమల్లోకి వచ్చాయి.
350సీసీ లోపు బైక్‌లపై జీఎస్టీ ఎంత తగ్గింది?
ఈ బైక్‌లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు.