ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నుంచి రాష్ట్రానికి వరుసగా సంస్థల్ని కేటాయిస్తున్నకేంద్ర ప్రభుత్వం తాజాగా కోనసీమ జిల్లాలోని నదీ ముఖద్వారం అంతర్వేదికి శుభవార్త చెప్పింది. అంతర్వేదికి ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ కీలకమైన సంస్థను ఇక్కడ కేటాయించింది. దాదాపు రెండు వేల కోట్ల రూపాయల ఖర్చుతో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోకి వచ్చే అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్, స్కిల్ డెవలప్మెంట్ స్కూలును ఏర్పాటు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు ఏర్పాటు కోసం అవసరమైన రూ.1890 కోట్లను కేటాయిస్తున్నారు. వాస్తవానికి డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ఆర్ధిక కష్టాల్లో ఉంది. ఈ ప్రాజెక్టు ఏర్పాటైతే ఆ కష్టాలు కొంత మేర తీరే అవకాశం ఉందని భావిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం డ్రెడ్జర్లు రిపేర్లు వస్తే హిందుస్దాన్ షిప్ యార్డుకు పంపాల్సి వస్తోంది. ఇప్పుడు అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్ ఏర్పాటు అయితే ఆ బాధ తప్పుతుంది. అలాగే డ్రెడ్జర్ల రిపేర్ల కోసం ప్రత్యేక హార్బర్ ఉండాలన్న డిమాండ్ ను కూడా నెరవేర్చినట్లవుతుందని కేంద్రం భావిస్తోంది. అందుకే అంతర్వేదిలో ఈ డ్రెడ్జింగ్ హార్బర్ తో పాటు వాటిని నడపడం, రిపేర్లపై శిక్షణ కోసం స్కూలును కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై కేంద్రం నుంచి అధికారికంగా దీనిపై ప్రకటన రానుందని అధికారులు చెప్తున్నారు.