ఈపీఎఫ్ఓ డిజిటల్ 3.0 తో విప్లవాత్మక మార్పులు
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) సేవల్లో మరింత పారదర్శకత, వేగం, వినియోగదారుల సౌకర్యం తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వం భారీగా డిజిటల్ మార్పులకు శ్రీకారం చుట్టింది. త్వరలో ప్రారంభమయ్యే డిజిటల్ వెర్షన్ 3.0 ద్వారా 9 కోట్ల మందికి పైగా ఈపీఎఫ్ఓ సభ్యులకు మేలు కలిగే అవకాశం ఉంది. ఈ కొత్త వెర్షన్‌లో ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్, డిజిటల్ డేటా కరెక్షన్లు, ఏటీఎం ద్వారా నగదు విత్‌డ్రాయల్ వంటి సదుపాయాలు ఉండనున్నాయి. అంటే ఇకపై ఈపీఎఫ్ఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, అన్ని సేవలు డిజిటల్ పద్ధతిలోనే పూర్తి చేయవచ్చు.
కేంద్ర కార్మిక శాఖ మంత్రి స్పష్టీకరణ
ఈపీఎఫ్ఓ డిజిటల్ వెర్షన్ 3.0 గురించి కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఇటీవల ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. “ఈ కొత్త వెర్షన్ అభివృద్ధిలో ఉంది. ఇది మే లేదా జూన్ నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. లక్షలాది మంది ఉద్యోగుల సమయాన్ని, శ్రమను, డబ్బును ఆదా చేయడమే దీని ప్రధాన ఉద్దేశం” అని ఆయన స్పష్టం చేశారు. ఈపీఎఫ్ఓ సేవలను మరింత సౌకర్యవంతంగా, సమర్థవంతంగా మారుస్తామని మంత్రి వెల్లడించారు.
ఫారాల భారం తొలగిపోతుంది
ఇప్పటివరకు ఒక క్లెయిమ్ దాఖలు చేయాలంటే లేదా ఖాతాలోని వివరాల్లో మార్పులు చేయాలంటే ఆయా శాఖల కార్యాలయాలను ఆశ్రయించాల్సి వచ్చేది. ఆ సమయంలో ఎదురయ్యే ఆలస్యం, పేపర్ వర్క్, అనవసరమైన ప్రయాణాలు, అపాయింట్‌మెంట్ల కోసం ఎదురుచూడటం వంటి ఇబ్బందులు మరింత భారం వేసేవి. అయితే 3.0 వెర్షన్‌తో ఈ సమస్యలు అన్ని మాయమవుతాయి. వినియోగదారులు తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా క్లెయిమ్ సెటిల్‌మెంట్లు, డిజిటల్ కరెక్షన్లు వంటి సేవలను ఆన్‌లైన్‌లోనే సులభంగా చేసుకోవచ్చు.
భవిష్య నిధి సేవల్లో ఆధునీకరణ
ఈపీఎఫ్ఓ డిజిటల్ 3.0 వెర్షన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉద్యోగుల భద్రతా వ్యవస్థ మరింత పటిష్టంగా మారబోతుంది. ఉద్యోగుల భవిష్య నిధిని సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని టెక్నాలజీ సాధనాలను సమగ్రంగా అందించడానికి ఈ నూతన వెర్షన్ ఉపయోగపడనుంది. ఫైల్ ప్రక్రియలు, మానవ ప్రమేయం తగ్గడం వలన తప్పులు తగ్గిపోతాయి. డేటా అంతా వన్-టైం డిజిటల్ అప్‌డేట్‌గా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
నూతన వ్యవస్థతో భవిష్య భద్రతకు బలం
ఉద్యోగులు ఉద్యోగం మారినప్పటికీ తమ పాత ఖాతాలో ఉన్న నిధులను నూతన ఖాతాలోకి మర్జ్ చేయడంలో ఎదురయ్యే చిక్కట్లు కూడా 3.0 వెర్షన్ ద్వారా తొలగనున్నాయి. ఆధార్ ఆధారిత పర్సనల్ ఐడెంటిఫికేషన్‌తో ఖాతాలను అనుసంధానించడం మరింత వేగంగా పూర్తవుతుంది. ఇవన్నీ ఉద్యోగి భద్రతను పెంపొందించడానికి, వారి భవిష్యాన్ని మరింత భద్రముగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడతాయి.
READ ALSO: RBI Imposes Penalty: బ్యాంకులపై ఆర్బీఐ కొరడా