దసరా పండగ సీజన్ దగ్గరపడుతున్న వేళ, సొంతూళ్లకు వెళ్లే ప్రజలపై ప్రైవేట్ బస్సు (Private bus) నిర్వాహకులు భారీ భారం మోపుతున్నారు. పండగ రద్దీని ఆసరాగా చేసుకొని, టికెట్ ధరలను రెండు నుంచి మూడు రెట్లు పెంచారు. దీంతో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు.
సాధారణ ధరలకు మూడింతలు ఛార్జీలు
ఉదాహరణకు, అక్టోబర్ 1న హైదరాబాద్ నుండి విశాఖపట్నం (Hyderabad to Visakhapatnam)వెళ్లే విమాన టికెట్ ధరలు సుమారు ₹4000 ఉండగా, అదే రోజున ఏసీ స్లీపర్ బస్సుల్లో ₹3800-₹4000 వసూలు చేస్తున్నారు. ఇదే మార్గంలో రైలు 3rd AC ఛార్జీ ₹1200 మాత్రమే కాగా, బస్సు ఛార్జీలు దాదాపు మూడింతలు పెరిగాయి.

సామాన్యులకు నాన్-ఏసీ బస్సులే భారంగా మారిన పరిస్థితి
నాన్-ఏసీ బస్సుల్లోనూ కనీసం ₹2700 వసూలు చేస్తున్నారు. కేవలం విశాఖపట్నం మాత్రమే కాదు, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, తిరుపతి, కడప వంటి మార్గాల్లో కూడా ఇదే తరహా అధిక ఛార్జీలు అమలవుతున్నాయి. ఉదాహరణకు, హైదరాబాద్-కడప టికెట్ సాధారణంగా ₹600 ఉండగా, ఇప్పుడు రెట్టింపు ధరలకు చేరుకుంది.
రైళ్లు ముందే హౌస్‌ఫుల్ – ప్రైవేట్ బస్సులే ఏకైక మార్గం
రైళ్లు రెండు నెలల ముందే ఫుల్ కావడంతో ప్రయాణికులు ప్రైవేట్ బస్సుల వైపే మొగ్గుతున్నారు. ప్రభుత్వ RTC కూడా ప్రత్యేక బస్సులు నడుపుతున్నా, డిమాండ్‌ను పూర్తిగా తీరుస్తూ లేకపోవడంతో, ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్ దయాపరులవుతున్నారు.
ఎప్పటికప్పుడు పెరుగుతున్న టికెట్ ధరలు
ప్రైవేట్ బస్సు నిర్వాహకులు, డిమాండ్ పెరిగిన ప్రతి రోజూ టికెట్ ధరలు పెంచుతున్నారు. ముందుగానే బుక్ చేసినవారికి కొంత తగ్గింపు కనిపించినా, చివరి నిమిషంలో టికెట్ల కోసం చూస్తే భారీ ఛార్జీలే ఎదురవుతున్నాయి. ఈ ధరల పెంపు ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది.
RTCకి 50% అదనపు ఛార్జీల అనుమతి
ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీకి 50% అదనపు ఛార్జీలు వసూలు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీన్ని ప్రైవేట్ ఆపరేటర్లు తమకు అనుకూలంగా మలుచుకొని, “ఆర్టీసీ పెడితే మేమెందుకు కాదు?” అన్న దృష్టితో ధరలు పెంచుతున్నారు.
రవాణా శాఖ చర్యలపై విమర్శలు
సామర్థ్యం ధ్రువీకరణ, బీమా తదితర అంశాల్లో తప్పులు ఉన్న ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ అధికారులు కొంతమేర చర్యలు తీసుకుంటున్నా, అధిక ఛార్జీల వసూళ్లపై మాత్రం మౌనం పాటిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయాణికుల హక్కులను పరిరక్షించే చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు ప్రజలలో పెరుగుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: