భువనేశ్వర్: మహా కుంభమేళా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సర్వీసులను ఫిబ్రవరి 4 వరకు ఒడిశా ప్రభుత్వం రద్దు చేసింది. అనివార్య పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ఉత్తర్వులో పేర్కొంది. మహా కుంభమేళా, అయోధ్యకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సర్వీసులను ఫిబ్రవరి 4 వరకు తక్షణమే రద్దు చేస్తున్నట్లు ఒడిశా ఆర్టీసీ తెలిపింది. తాజా అప్‌డేట్‌ను అధికారిక వెబ్‌సైట్, సోషల్ మీడియాలో సమాచారం ఇస్తామని పేర్కొంది. ఈ మేరకు గురువారం ఒక నోటీస్‌ను జారీ చేసింది. అయితే ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళాకు ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహించాలని గతంలో నిర్ణయించింది.

కాగా, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. అయితే మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్ద తోపులాట జరిగింది. ఈ సంఘటనలో 30 మంది భక్తులు మరణించారు. 60 మందికిపైగా గాయపడ్డారు. పలువురి జాడ కనిపించడంలేదు. అలాగే అగ్నిప్రమాదాలు వంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ రాష్ట్రం నుంచి భక్తుల రద్దీని తగ్గించేందుకు మహా కుంభమేళాకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది.