తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. అయితే, గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) సభ్యులు పలుమార్లు నినాదాలు చేస్తూ అసెంబ్లీలో హల్‌చల్ సృష్టించారు. రుణమాఫీ, రైతు భరోసా, పంటలకు రూ. 500 బోనస్, కృష్ణా జలాల అంశాలపై గవర్నర్ మాట్లాడుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. అయితే, వాటిని పట్టించుకోకుండా గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
గవర్నర్ ప్రసంగం
తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటుందని గవర్నర్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ముఖ్యంగా రైతులు, మహిళలు, యువత కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
రైతుల సంక్షేమం రుణమాఫీ
తెలంగాణ రైతులు రాష్ట్రానికి ప్రాణం వంటి వారని, గవర్నర్ ప్రశంసించారు. 260 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తితో తెలంగాణ దేశవ్యాప్తంగా రికార్డు సృష్టించిందని తెలిపారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రూ. 2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.రైతు భరోసా పథకం కింద నేరుగా రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. పంట సాయాన్ని రూ. 12,000కి పెంచినట్లు తెలిపారు. అలాగే, వరి రైతులకు రూ. 500 బోనస్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

కొత్త పథకాలు
మహిళల సాధికారత కోసం “మహాలక్ష్మి పథకం” రూపకల్పన చేసినట్లు గవర్నర్ వివరించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించామని అన్నారు.
తెలంగాణ అభివృద్ధి
తెలంగాణ పురోగమించడమే కాదని, రూపాంతరం చెందుతోందని గవర్నర్ అన్నారు. సమ్మిళిత, స్వయం సమృద్ధి, సాధికార తెలంగాణ విజన్‌తో పని చేస్తున్నామని అన్నారు.గవర్నర్ ప్రసంగంతో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అధికారికంగా శ్రీకారం చుట్టారు.బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష నిరసనలు, ప్రభుత్వ విధానాలు, నూతన బడ్జెట్ ప్రకటనలపై చర్చలు మరింత ఆసక్తి గా మారే అవకాశముంది.