పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. తొలిరోజు శుక్రవారం పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. పార్లమెంట్ సమావేశాలు రెండు విడుతల్లో జరుగనున్న విషయం తెలిసిందే. తొలి విడత సమావేశాలు 31 నుంచి మొదలై.. ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతాయి. ఇక రెండో విడుత సమావేశాలు మార్చి 10న మొదలై.. ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. మంగళవారం విడుదలైన పార్లమెంటరీ బులిటెన్ ప్రకారం.. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్‌సభలో కేంద్ర బడ్జెట్-2025ను ప్రవేశపెడుతారు. అంతకుముందు రోజు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత అరగంట తర్వాత.. రాజ్యసభ కార్యకలాపాలు మొదలవుతాయి.

పార్లమెంట్ సమావేశాలకు ముందురోజు జనవరి 30న ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. రాబోయే సమావేశాల్లో సభను సజావుగా నిర్వహించేందుకు ప్రతిపక్ష నాయకులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గతంలో సమావేశాలు జరిగిన తీరును ప్రస్తావించారు. రెండు సెషన్లలో పార్లమెంట్ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. దాంతో పార్లమెంట్ ప్రతిష్ట దెబ్బతిందని.. ఈ సమావేశాల్లోనైనా ప్రతిపక్ష నాయకులు, ఇతర ఎంపీలు చర్చల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షం సహకరిస్తేనే పార్లమెంట్ పని చేయడంతో పాటు చర్చలు జరుగుతాయన్నారు. ఈ సారి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సమతుల్య బడ్జెట్‌ను ప్రవేశపెడుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.