వేతన జీవులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2025 బడ్జెట్‌లో వారికి భారీ ఊరట దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈసారి వేతన జీవుల ఆదాయ పన్ను భారం తగ్గించేందుకు ప్రభుత్వం పలు చర్యలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. వార్షిక ఆదాయం రూ.10 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వాలనే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందని సమాచారం. ఈ మార్పు అమలులోకి వస్తే మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరటగా మారనుంది. వేతన జీవులకు దీని ద్వారా ఉపాధి భారం తగ్గి, సొమ్మును ఇతర అవసరాల కోసం వినియోగించుకునే అవకాశం లభిస్తుంది.
ఇదే కాదు రూ.15లక్షల నుంచి రూ.20లక్షల మధ్య వార్షిక ఆదాయానికి కొత్తగా 25% పన్ను శ్లాబ్ తీసుకురావాలని కేంద్రం ఆలోచిస్తోంది. ప్రస్తుతం రూ.15లక్షల పైబడిన ఆదాయానికి 30% పన్ను విధిస్తుండగా, కొత్తగా 25% శ్లాబ్ అమలులోకి వస్తే, ఆ వర్గానికి కూడా కొంత ఊరట లభించవచ్చు. పన్ను మినహాయింపులతో పాటు, బడ్జెట్‌లో కొత్త పెట్టుబడులు, ఉపాధి కల్పన, సబ్సిడీలకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసే అవకాశాలు ఉన్నాయి. మధ్య తరగతి వేతన జీవులు తమ బడ్జెట్ ప్లాన్‌లో కీలక మార్పులు చేసుకునేలా ఈ మార్పులు ఉపయోగపడతాయి.
ఈ మార్పులు అమలులోకి వస్తే.. ఆదాయ పన్ను వ్యవస్థ మరింత సరళంగా మారనుంది. దేశంలోని వివిధ వర్గాలకు ఈ బడ్జెట్ ఎంతవరకు న్యాయం చేస్తుందనేది ఫిబ్రవరి 1న వెల్లడవుతుంది. అయితే, వేతన జీవులకు ఊరట కలిగించాలనే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న వార్తలు దేశవ్యాప్తంగా సానుకూలతను తెచ్చాయి.