Minister Komatireddy : నల్గొండ జిల్లాలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరోసారి బీఆర్‌ఎస్‌పై విమర్శులు గుప్పించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ కనుమరుగవుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మరోవైపు అధికారంలోకి ఉవ్విళ్లూరుతున్న బీజేపీ కలలు ఫలించవని జోస్యం చెప్పారు. సన్నబియ్యం పథకంలో తమ వాటా ఉందన్న బీజేపీ నేతల విమర్శల్లో అర్థం లేదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతల దోపిడీ వల్లే కాళేశ్వరం కూలిపోయిందని ఆరోపించారు. ఎస్ఎల్‌బీసీ సొరంగ మార్గాన్ని తప్పకుండా పూర్తి చేస్తామని తెలిపారు.

ప్రభుత్వం తీసుకున్నది సాహసోపేత నిర్ణయం
పేద ప్రజల ఆహార భద్రతను మెరుగుపరిచేందుకు సన్న బియ్యం పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నది సాహసోపేత నిర్ణయం. ఈ పథకం వల్ల పేదల ఆకలి తీరడమే కాదు.. ఆత్మగౌరవం పెరుగుతుంది. పేదలకు మెరుగైన ఆహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టింది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం పేదలకు లబ్ధి చేకూర్చే గొప్ప అడుగు. తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పని చేస్తోంది. సన్న బియ్యం పంపిణీని విజయవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.