బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సభను రాష్ట్ర స్థాయి నాయకత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
ఈ బహిరంగ సభ అనంతరం బీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేయనుంది. పార్టీలో ఉన్న కార్యకర్తలకు మరియు నేతలకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మరింత బలం చాటుకోవడం కోసం అన్ని స్థాయిల్లో కార్యాచరణను సిద్ధం చేయనున్నట్లు వివరించారు.
సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ప్రారంభమవుతుందని కేటీఆర్ తెలిపారు. దీనికి సంబంధించి గ్రామ స్థాయిలో కార్యకర్తలు, నాయకులను చైతన్య పరచి, వారి భాగస్వామ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పార్టీ నిర్మాణంలో ఈ కార్యక్రమం కీలకంగా నిలుస్తుందని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయాలను పునరుద్ఘాటిస్తూ, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టతనిచ్చే ఈ బహిరంగ సభ తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకోనుంది. బీఆర్ఎస్ నేతలు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువచేయాలని ఉత్సాహంగా పనిచేస్తున్నారు. తమ ప్రభుత్వం హయాంలో రైతులకు రైతుబంధు లాంటి పథకాలను సంవత్సరానికి రెండు సార్లు అందించాం. మా ప్రభుత్వం పేద రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. కానీ కాంగ్రెస్ హయాంలో ఈ పథకం అమలు కాకపోవడం విచారకరం అని కేటీఆర్ విమర్శించారు.