ఏపీలో వివాదాలు, నిరసనల నడుమ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు నిర్వహించబడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతుండగా, 92,250 మంది అభ్యర్థులు హాజరయ్యారు. దీనికోసం ఏపీపీఎస్సీ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. అయితే, ఈ పరీక్షల మొదటి రోజు ఓ ప్రత్యేకమైన ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో ఓ వధువు పెళ్లి దుస్తుల్లోనే పరీక్ష రాయడానికి రావడం విశేషంగా మారింది.

తలపై జీలకర్ర బెల్లంతోనే
తిరుపతికి చెందిన నమిత ఈ ఉదయం వివాహం చేసుకుంది. తనకు పరీక్ష కూడా ఉందని తెలుసు కాబట్టి పెళ్లి తంతు ముగియగానే, తలపై జీలకర్ర బెల్లంతోనే, పెళ్లి చీరలోనే పరీక్షా కేంద్రానికి చేరుకుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆమెకు అశీర్వాదాలు అందించగా, పరీక్ష కేంద్రంలో ఉన్న అభ్యర్థులు, సిబ్బంది ఆశ్చర్యపోయారు. కేవలం విద్యపై ఉన్న పట్టుదల, గ్రూప్-2 పరీక్షను రాయాలన్న పట్టుదల వల్ల నమిత తన పెళ్లి వేడుకలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పరీక్షకు హాజరైంది.
నమిత లాంటి అభ్యర్థుల పట్టుదల చాలా మందికి స్ఫూర్తిదాయకం
ఈ పరీక్షలపై గత కొన్ని రోజులుగా అభ్యర్థులు నిరసనలు తెలుపుతూ, రోస్టర్ విధానంలో ఉన్న తప్పులను సవరించాలని, పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అభ్యర్థుల ఆందోళనలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినప్పటికీ, ఏపీపీఎస్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, నమిత లాంటి అభ్యర్థుల పట్టుదల చాలా మందికి స్ఫూర్తిదాయకంగా మారింది.