సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు జన్వాడ ఫామ్ హౌస్ పై నిర్వహించిన దాడి రాజకీయ ఉత్కంఠను రేపింది. రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించిన సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీలు జరిపారు. అనుమతుల లేకుండా నిర్వహించిన ఈ పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకుని, వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఒకరికి కొకైన్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. పోలీసులు విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఫామ్ హౌస్ కేటీఆర్ మావమరిది కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు డ్రగ్స్ రహిత తెలంగాణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా ప్రకటిస్తూనే, మరోవైపు రేవ్ పార్టీలను నిర్వహించడం సిగ్గు కరమని ఆరోపించారు. ఆయన గత శనివారం రాత్రి జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఫామ్ హౌస్ యజమానితో సంబంధాలున్నాయని, అందువల్లనే అధికారులు సీసీ ఫుటేజీని విడుదల చేయట్లేదని చెప్పారు.
రఘునందన్ రావు డీజీపీ జితేందర్ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రికి డిమాండ్ చేస్తూ, 12 గంటల లోపు సీసీ ఫుటేజీని విడుదల చేయాలని చెప్పారు. ఫాంహౌస్ లోని పుటేజీలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, తద్వారా నిజమైన పరిస్థితులు వెల్లడించబడతాయని అభిప్రాయపడ్డారు.