జాతీయ చేనేత దినోత్సవాన్ని (National Handloom Day) పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త చెప్పింది. చేనేత రంగాన్ని ప్రోత్సహించడానికి, కార్మికులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. దీనిలో భాగంగా, చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు మరియు మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇది చేనేత కార్మికులకు పెద్ద ఉపశమనం కలిగించనుంది.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాట్లాడుతూ, చేనేత కళ భారతదేశ సంస్కృతికి, స్వాతంత్ర్య స్ఫూర్తికి ప్రతీక అని కొనియాడారు. ఉచిత విద్యుత్ పథకంతో పాటు, చేనేత సొసైటీల నుంచి ఆప్కో (APCO) కొనుగోలు చేసే వస్త్రాలపై 5 శాతం జీఎస్టీ రాయితీ ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్లు వివరించారు. ఈ నిర్ణయాలు చేనేత రంగంపై ఆధారపడిన వారికి ఆర్థికంగా ఎంతో ప్రయోజనం కల్పిస్తాయి. అదనంగా, కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం చేనేత రంగానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. చేనేత వస్త్రాల వాడకాన్ని పెంచేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపడతామని ఆయన చెప్పారు. యువత వారానికి ఒక్కరోజునైనా చేనేత వస్త్రాలు ధరిస్తే, ఆ రంగంపై ఆధారపడిన లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన పిలుపునిచ్చారు.
Read Also : Sangeetha: విడాకుల వార్తపై స్పందించిన సినీ నటి సంగీత