గత పాలకుల అనాలోచిత విధానాలు, అరాచక పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం అయ్యాయని, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. అధికారం పోయినా సరే, కొందరు నేతలు ఇంకా రౌడీయిజం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, అటువంటి ధోరణిని సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. “మీ ఇంట్లో మీరు పెద్ద నాయకుడు కావచ్చేమో కానీ, బయట అది సాగదు” అంటూ వైఎస్ జగన్‌ను ఉద్దేశించి పరోక్షంగా చురకలు అంటించారు. చట్టాన్ని అతిక్రమించి ఎవరైనా అల్లర్లు సృష్టించాలని చూస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు.
Madras HC: చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన
రాష్ట్రంలో నెలకొన్న హింసాత్మక రాజకీయ సంస్కృతిపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. “రప్పారప్పా” అనడం, జంతువులను బలిచ్చి పోస్టర్లపై రక్తం చల్లడం వంటి వికృత చేష్టలు ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి చర్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని, ఇవి రాజకీయ విధానాలు కావని ఆయన దుయ్యబట్టారు. రాజకీయాల పేరుతో కావాలని సమస్యలు సృష్టించడం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం వంటి పనులకు స్వస్తి చెప్పాలని హితవు పలికారు. కేవలం భయం పుట్టించడం ద్వారా రాజకీయం చేయాలనుకోవడం వారి మూర్ఖత్వమే అవుతుందని, ప్రజలు ఇప్పటికే అటువంటి ధోరణిని తిరస్కరించారని గుర్తు చేశారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని సీఎం స్పష్టం చేశారు. రౌడీయిజం, గూండాగిరీ చేసే వారికి ఏపీలో తావు లేదని, అటువంటి వారు తమ పద్ధతి మార్చుకోకపోతే ‘రాష్ట్ర బహిష్కరణ’ తప్పదని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టం ముందు సమానమేనని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టాల్సిన సమయంలో, కొందరు వ్యక్తులు కేవలం విద్వేషాలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్రంలో మళ్ళీ ప్రజాస్వామ్యబద్ధమైన పాలనను సుస్థిరం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com