తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కలను సాకారం చేస్తామని ప్రకటించారు. జూబ్లీహిల్స్ లో జరిగిన వైఎస్సార్ మెమోరియల్ అవార్డు-2025 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మించి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చేవెళ్ల, వికారాబాద్ జిల్లాలకు గోదావరి జలాలను అందించాలన్న వైఎస్సార్ ఆశయాన్ని తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించి, వారి జీవితాల్లో వెలుగులు నింపుతామని ఆయన అన్నారు.
వైఎస్ షర్మిలను వేదికపైకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి
ఈ కార్యక్రమం(YSR Memorial Award)లో ఒక హృద్యమైన సంఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వైఎస్ షర్మిలను వేదికపైకి ఆహ్వానించారు. ఆమెను తన కుర్చీలో కూర్చోవచ్చని ఆత్మీయంగా పలకరించి, గౌరవించారు. ఈ సంఘటన వేదికపై ఉన్న వారందరినీ, ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి హర్యానా మాజీ ముఖ్యమంత్రి శ్రీ భూపేందర్ సింగ్ హూడా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ మెమోరియల్ అవార్డ్స్ వేదిక
డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి మెమోరియల్ అవార్డు-2025 కార్యక్రమం దస్పల్ల కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులలో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, సిడబ్ల్యుసి సభ్యులు రఘువీరారెడ్డి కూడా ఉన్నారు. వైఎస్సార్ సేవలను, తెలంగాణ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం జరిగింది. రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలు, షర్మిల పట్ల చూపిన గౌరవం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.