గణేష్ నిమజ్జన (Ganesh Nimajjanam) వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌లో గణనాథుల నిమజ్జనం ప్రారంభమైందని, ఇప్పటివరకు దాదాపు లక్షన్నరకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేశారని ఆమె వెల్లడించారు. ప్రధానంగా ట్యాంక్ బండ్ వద్ద లక్ష విగ్రహాలు, బేబీ పాండ్స్, చెరువుల్లో 56 వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనం అయినట్లు ఆమె చెప్పారు.
ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా, పరిశుభ్రంగా జరిగేలా చర్యలు తీసుకున్నామని మేయర్ తెలిపారు. హుస్సేన్ సాగర్ పరిసరాలలో 24/7 శానిటేషన్ పనులు చేపడుతున్నామని చెప్పారు. నిమజ్జనం తర్వాత ఏర్పడే వ్యర్థాలను వెంటనే తొలగించి, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కృషి చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రేన్లు, నిమజ్జన బేబీ పాండ్స్ గణనాథుల నిమజ్జనాన్ని సులభతరం చేశాయని ఆమె అన్నారు.
రేపు జరగనున్న చివరి రోజు నిమజ్జన వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. అన్ని గణేష్ మండలి కమిటీలతో సంప్రదింపులు జరిపి, నిమజ్జనం సాఫీగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఈ వేడుకలకు పోలీసులు, జీహెచ్‌ఎంసీ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు.