తమిళనాడులోని కరూర్లో జరిగిన తోపులాట, తొక్కిసలాట (Karur Stampede) ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. TVK పార్టీ చీఫ్ విజయ్ రోడ్‌షో సందర్భంగా భారీగా గుమికూడిన ప్రజలు ఒకరినొకరు తోసుకోవడం, వాహనాలపైకి ఎగబడ్డం వల్ల పరిస్థితి అదుపు తప్పి పెద్ద దుర్ఘటన జరిగింది. నిన్నటి ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరుకోవడంతో రాష్ట్రం అంతా విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షులు చేసిన వ్యాఖ్యలు కొత్త కోణాన్ని చూపిస్తున్నాయి.

ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. విజయ్ (Vijay) కరూర్కు ప్రచార బస్సులో వస్తుండగా ఆయనను చూసేందుకు వేలాది మంది అభిమానులు, స్థానికులు ఎగబడ్డారు. ఆందోళనకరమైన వాతావరణంలో కొందరు బస్సుపైకి చెప్పులు విసిరారని వారు తెలిపారు. ఒకరినొకరు తోసుకోవడంతో జనం కూలిపోవడం, తోపులాట జరగడం ప్రారంభమైందని ప్రత్యక్ష సాక్షులు వివరించారు. ఈ సమయంలో విజయ్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలి ఉంటే జనసందోహం కొంత నియంత్రణలో ఉండేదని వారు అభిప్రాయపడ్డారు.
Fondness : ప్రాణాలు తీస్తున్న అభిమానం!
విజయ్ అలా చేయకపోవడంతో జనం మరింతగా వాహనాల వెనక గుమికూడారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వేదికపై ఉన్న భద్రతా సిబ్బంది, పోలీసులు కూడా పరిస్థితిని సకాలంలో అంచనా వేయలేకపోయారని వారు అన్నారు. ఈ ఘటనలో ఏర్పడిన అయోమయం, తగిన భద్రతా చర్యల లోపం, నిర్వహణ లోపాలే ప్రాణనష్టానికి కారణమని ప్రత్యక్ష సాక్షుల వాఖ్యలు సూచిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.