పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ (HHVM) సినిమాపై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు శ్రీనివాసరావు ఈ చిత్రంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చిత్రంలోని కథను కల్పితంగా అభివర్ణిస్తూ, ఇది చారిత్రకంగా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ఆరోపించారు. “ఈ సినిమా ఊహాజనిత కథ ఆధారంగా రూపొందించబడినదిగా స్పష్టంగా ప్రకటించకపోతే, ప్రజలు దాన్ని చారిత్రకంగా భావించే ప్రమాదం ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
ముస్లిం వ్యతిరేకతకు దారితీసే విధంగా ఉందా?
సినిమా తీరుతెన్నులు ముస్లింల పట్ల ద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని సీపీఎం నేత ఆరోపించారు. “అపోహలతో కూడిన ఈ కథా నిర్మాణం ముస్లింల పట్ల ప్రజల్లో తప్పుడు భావనలను కలిగించవచ్చు. ఇది దేశీయ ఐక్యతకు, సామాజిక సమగ్రతకు విఘాతం కలిగించే ప్రమాదం ఉంది. ప్రజల మధ్య మతసౌహార్ధాన్ని దెబ్బతీసే చిత్రాలను వ్యతిరేకించాలి” అని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
కల్పిత కథగా స్పష్టత ఇవ్వాలని డిమాండ్
ఈ సినిమాపై వివాదాలు ముదరకముందే చిత్ర బృందం తగిన స్పష్టత ఇవ్వాలని CPM నేత డిమాండ్ చేశారు. “పవన్ కళ్యాణ్‌కు ప్రజల్లో ఉన్న ప్రభావం దృష్టిలో ఉంచుకుంటే, ఆయన ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది. సినిమా ప్రారంభంలోనే ఇది ఊహాజనితంగా రూపొందించబడిందని స్పష్టంగా ప్రకటించాలి. లేనిపక్షంలో మతవిద్వేషాలు పెరగడానికి ఈ సినిమా కారణమవుతుంది” అని హెచ్చరించారు. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడం బదులు సామాజిక సమగ్రతను పెంపొందించే దిశగా సినిమా ఉండాలన్నారు.
Read Also : Phone Signal : టవర్స్ లేకున్నా ఎక్కడి నుంచైనా సిగ్నల్స్ – మస్క్