ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు బెదిరింపులు రావడం తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. శుక్రవారం ఉదయం పాకిస్థాన్ నంబర్ నుంచి వాట్సాప్ ద్వారా ముంబయి ట్రాఫిక్ పోలీసులకు ఓ మెసేజ్ వచ్చింది. అందులో మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ కార్యాలయంపై దాడి చేయనున్నట్లు బెదిరింపులకు పాల్పడ్డారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి తనను తాను మాలిక్ షాబాజ్ హుమాయున్ రాజా దేవ్‌గా పేర్కొన్నారు. బెదిరింపు మెసేజ్‌తో వెంటనే అప్రమత్తమైన ముంబయి పోలీసులు సీఎం భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేకాదు, ఈ బెదిరింపు మెసేజ్‌పై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

బూటకపు బెదిరింపు
అంతేకాకుండా, ఇటీవలే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేకి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే. షిండే కారును బాంబులతో పేల్చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు ముంబై పోలీసులకు మెయిల్ చేశారు. అప్రమత్తమైన పోలీసులు.. దర్యాప్తు చేపట్టగా అది బూటకమని తేలింది. ఇప్పుడు సీఎంకు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.