తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు రేగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. కల్వకుంట్ల కవిత (Kavitha) గతంలో పార్టీకి ఎన్నోసార్లు వెన్నుపోటు పొడవాలని హరీశ్ రావు ప్రయత్నించారని ఆరోపించారు. హరీశ్ రావు వల్లే ఈటల రాజేందర్, మైనంపల్లి హనుమంతరావు, జగ్గారెడ్డి, విజయశాంతి, విజయరామారావు వంటి సీనియర్ నాయకులు పార్టీని వీడారని ఆమె మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల ఓటమికి కారణం హరీశే
కవిత తన ఆరోపణలను కొనసాగిస్తూ, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) పార్టీ ఓటమికి ప్రధాన కారణం హరీశ్ రావేనని స్పష్టం చేశారు. హరీశ్ రావు, సంతోష్ మేకవన్నె పులులని, పార్టీని నష్టపరచడానికి కుట్రలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. కేవలం ఎన్నికలలో మాత్రమే కాకుండా, పార్టీ అంతర్గత వ్యవహారాలలో కూడా హరీశ్ రావు జోక్యం చేసుకుని పార్టీని బలహీనపరుస్తున్నారని ఆమె ఆరోపించారు.
కేసీఆర్ ను నాకు దూరం చేసేందుకు కుట్ర
కవిత మరింత ముందుకు వెళ్లి, హరీశ్ రావు తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) కు తనను దూరం చేసేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు పార్టీలోని అంతర్గత కుమ్ములాటలను స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ రాజకీయ భవిష్యత్తుపై ఈ ఆరోపణలు ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఈ విభేదాలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.