ఒకానొకప్పుడు బాలీవుడ్‌ని తన అందం, అభినయంతో ఊపేసిన నటి ఊర్మిళ… చిన్న వయస్సులోనే నటన ప్రారంభించి, 1990లలో హీరోయిన్‌గా స్టార్ స్థాయికి ఎదిగింది. “రంగీలా” చిత్రంతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారింది. ఆ సినిమాలోని మిలీ పాత్ర ద్వారా ఊర్మిళ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించింది. “సత్య”, “భూత్”, “జుదాయి”, “కౌన్” వంటి సినిమాల్లో నటనతో మెప్పించి, హీరోల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి చేరుకుంది.
వర్మతో సన్నిహిత సంబంధాలు
అయితే ఆమె కెరీర్‌లో తిరుగులేని మలుపు 2000ల మధ్యలో చోటుచేసుకుంది. ఆమె చేసిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడం, వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న వివాదాలు ఆమె కెరీర్‌ను దిగజార్చాయి. ముఖ్యంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఆమె సన్నిహిత సంబంధాల వార్తలు పెద్ద దుమారం రేపాయి. ఆయనతో మాత్రమే పని చేస్తూ, ఇతర అవకాశాలను వదిలేసినట్లు వార్తలు రావడంతో ఆమె మార్కెట్ క్రమంగా పడిపోయింది.

వివాహం , విడాకులు
ఆమె వ్యక్తిగత జీవితమూ అంతే అస్తవ్యస్తంగా మారింది. 2016లో ముహ్సిన్ అక్తర్ మీర్ అనే కాశ్మీరీ వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న ఊర్మిళ, 2024లో విడాకుల దరఖాస్తుతో ఒంటరి జీవితాన్ని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం 51 ఏళ్ల వయసులో ఆమె సినీ ఇండస్ట్రీకి దూరంగా, రాజకీయాల్లో కొంతవరకు కనిపించినప్పటికీ అంతగా జోష్ కనబరచలేదు. చిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన ఊర్మిళ జీవిత ప్రయాణం అనూహ్య మలుపులతో గందరగోళంగా మారడం అందరికి బాధ కలిగించే విషయం.