ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరంలో ఉగ్రవాద (Terrorists ) కదలికలపై నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ధర్మవరం కోట ప్రాంతంలో కొందరు వ్యక్తులకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని సమాచారం అందడంతో, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా స్థానికంగా ఓ హోటల్‌లో వంటవాడిగా పనిచేస్తున్న 40 ఏళ్ల నూర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నూర్ ప్రవర్తనపై గత కొంతకాలంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అధికారులు తెలిపారు.
16 సిమ్ కార్డుల స్వాధీనం
ఎన్‌ఐఏ (NIA ) అధికారులు నూర్ నివాసంలో సోదాలు నిర్వహించి, 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సిమ్ కార్డుల ద్వారా నూర్ ఉగ్రవాద సంస్థలతో వాట్సాప్ కాల్స్, సోషల్ మీడియా చాటింగ్‌లు జరిపి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. నూర్ సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నూర్ ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నాడనే అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం.
దర్యాప్తు కొనసాగింపు
నూర్ వాట్సాప్ కాల్స్, సోషల్ మీడియా సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా అతని కదలికలు, సంప్రదింపుల వివరాలను ఎన్‌ఐఏ అధికారులు సేకరిస్తున్నారు. ఈ దర్యాప్తు వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఉగ్రవాద కదలికల నెట్‌వర్క్‌పై మరింత సమాచారం వెలువడే అవకాశం ఉంది. అక్రమ నివాసితులు, ఉగ్రవాద అనుబంధ కార్యకలాపాలపై అధికారులు నిఘా పెంచారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.