ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ప్రతిపక్ష పార్టీ వైసీపీ, అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ (TDP) ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి (శ్రీశైలం), నజీర్ అహ్మద్ (గుంటూరు ఈస్ట్), మరియు కూన రవికుమార్ (ఆమదాలవలస). వీరు వివిధ నేరాలకు పాల్పడ్డారని వైసిపి ఆరోపించింది.
వైసిపి ఆరోపణలు
వైసిపి ఆరోపణల ప్రకారం.. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీ అధికారులపై దాడికి పాల్పడ్డారని, దీనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తన సొంత పార్టీ కార్యకర్తను వేధించారని, అలాగే ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఒక మహిళా ప్రిన్సిపల్‌ను వేధించారని వైసిపి తీవ్ర ఆరోపణలు చేసింది.
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మౌనంపై ప్రశ్న
ఈ ఘటనలపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని వైసిపి ప్రశ్నించింది. ప్రజాప్రతినిధులు ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసిపి డిమాండ్ చేసింది. ఈ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.