Hyderabad: రాష్ట్రంలో ఉపాధి హమీ పనులు జోరుగా సాగుతున్నాయి. కేంద్రం కేటాయించిన ఆరున్నర కోట్ల పనిదినాల్లో ఇప్పటికే 4.53 కోట్ల పనిదినాలను తెలంగాణ పూర్తి చేసింది. అంటే మొత్తం కేటాయించిన పనిదినాల్లో 70 శాతం లక్ష్యాన్ని తెలంగాణ సాధించింది. అయితే గతంలో మాదిరిగా 12 కోట్ల పనిదినాలు తెలంగాణకు కేటాయించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క (Seethakka) కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాశారు. పనిదినాలు రెట్టింపు చేయాలని కేంద్రాన్ని కోరనున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రం నుంచి అనుమతులు వస్తాయన్న నమ్మకంతో ఉపాధి హమీ పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 18.9 లక్షల కుటుంబాల్లోని 28.48 లక్షల మంది ఉపాధి కూలీలకు పని కల్పించారు.

రోజువారీ కూలీకి రూ.250.75 వేతనం
ఒక్కొ కుటుంబం సగటున 24 రోజుల పని దినాలను పూర్తి చేసుకుంది. 1127 కుటుంబాలు వంద రోజుల పనిదినాలను పూర్తి చేసుకున్నాయి. అయితే సగటున ఒక్కో కూలీకి రూ.250.75 రోజువారి వేతనం లభిస్తుంది. అయితే రోజు వారి వేతనం రూ.307 దక్కెలా చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తూ కూలీ గిట్టుబాటు అయ్యేలా చర్యలు చేపడుతున్నారు. ఉపాధి హమీ పనుల్లో భాగంగా వ్యవసాయ అనుబంధ పనులకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఉపాధి హమీ పనుల్లో 60 శాతం పనులు వ్యవసాయ అనుబంధ పనులు చేయించాలని లక్ష్యం పెట్టుకోగా వ్యవసాయ అనుబంధ పనులు 50 శాతంగా నమోదయ్యాయి. ఇందులో ప్రధానంగా ఫాం పాండ్స్. పశువుల కొట్టాలు, మొక్కల నాటింపు వంటి పనులు లక్షకు పైగా కొనసాగుతున్నాయి. జీపీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, సీసీ రోడ్ల వంటి మళిక వసతుల కల్పన పనులు లక్షా 31 వేలకు పైగా కొనసాగుతున్నాయి.
గ్రామీణ అభివృద్ధికి ఉపాధి హమీ కీలకం
అయితే ఉపాధి హమీ పనుల్లో ఉపాధి కల్పన తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సదుపాయాల కల్పన, ఆస్టుల సృష్టి తెలంగాణ ప్రభుత్వం ఆధిక ప్రధాన్యతనిస్తోంది. మే మాసం ముగిసే నాటికి ఉపాధి హమీలో భాగంగా రూ. 1416 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. అందులో రూ.1151.67 కోట్లు వేతనాలు కాగా, రూ.191.03 కోట్లు మేటిరియల్ కాంపోనెంట్ గా నమోదు అయ్యింది. అయితే కేంద్రం నుంచి నిధుల విడుదలతో జాప్యంమైనా కూలీలకు ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వేతనాలను ఉపాధి కూలీల ఖాతాల్లో జమచేస్తోంది. ఇప్పటి వరకు కూలీల ఖాతాల్లో 733.52 కోట్లు జమ అయ్యాయి. అయితే ఉపాధి హమీ పనులకు తెలంగాణలో భారీ డిమాండ్ ఉంది. మరీ ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తుండటంతో, ఉపాధి పనులకు ప్రజలు మొగ్గు చూపు తున్నారు. అయితే గత యేడాదితో పోలిస్తే ఉపాధి పనిదినాలను సగానికి కేంద్ర ప్రభుత్వం కుదించింది. దీనిపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి మంత్రి సీతక్క (Seethakka) ఇప్పటికే లేఖ రాశారు. అపాయింట్మెంట్ రాగానే కేంద్ర పెద్దలను కలసి.. ఉపాధి పని దినాలను కనీసం 12 కోట్లకు పెంచాలని విజ్ఞప్తి చేయనున్నారు.
Read also: Gachibowli: ఒక్క ప్లాట్ రూ.33 కోట్లు..