జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలోని బైసరన్ మైదానంలో చోటుచేసుకున్న ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసిన సంఘటనగా నిలిచింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ ప్రాంతంలో జరిగిన అత్యంత తీవ్రమైన ఈ దాడి, భారత్ భద్రతా వ్యవస్థపై మరోసారి సవాలుగా నిలిచింది.

ఉగ్రదాడికి పాల్పడిన ఐదుగురు గుర్తింపు
దర్యాప్తు సంస్థలు ఈ దాడికి పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులను గుర్తించాయి. వీరిలో ముగ్గురు పాకిస్థాన్ జాతీయులు – ఆసిఫ్ ఫౌజీ (కోడ్ నేమ్ మూసా), సులేమాన్ షా (కోడ్ నేమ్ యూనస్), అబు తల్హా (కోడ్ నేమ్ ఆసిఫ్)గా గుర్తింపు పొందారు. మిగిలిన ఇద్దరు స్థానికులు – అనంతనాగ్ జిల్లాలోని బిజ్‌బెహరాకు చెందిన ఆదిల్ గురి మరియు పుల్వామా వాసి అహ్సాన్. వీరిలో ఆదిల్ మరియు అహ్సాన్ 2018లో పాకిస్థాన్‌కు వెళ్లి ఉగ్రవాద శిక్షణ పొంది, ఇటీవలే భారత్‌లోకి తిరిగి చొరబడ్డట్లు సమాచారం. ఈ ఇద్దరు యువకుల కథలు కశ్మీర్ యువతను ఎలా ఉగ్రవాద శిబిరాల్లోకి లాగుతున్నారో కళ్లకు కట్టినట్లుగా చెప్పేస్తున్నాయి.
ఈ దాడిలో ఉగ్రవాదులు అత్యంత క్రూరంగా వ్యవహరించినట్లు వాంగ్మూలాల ఆధారంగా తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం, ముఖ్యంగా పురుషులను ఇస్లామిక్ ప్రార్థనలు చెప్పమని లేదా సున్తీ వంటి గుర్తులను చూపించి వారి మతాన్ని నిరూపించుకోవాలని బలవంతం చేసినట్లు కేంద్ర ఏజెన్సీలు తెలిపాయి. ఇలాంటి చర్యలు దాడి వెనుక ఉన్న మతాత్మక ఉగ్రవాద దృక్పథాన్ని స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. దాడి జరిగిన ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడం దర్యాప్తుకు ప్రధాన అడ్డంకిగా మారింది. అయితే బాధితుల వాంగ్మూలాలు, ప్రత్యక్ష సాక్షుల కథనాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. దాడి అనంతరం ఉగ్రవాదులు పీర్ పంజాల్ పర్వత శ్రేణుల్లోకి పారిపోయి ఉండవచ్చన్న అనుమానంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి.
ముగ్గురు నిందితుల స్కెచ్‌లు విడుదల
జమ్మూకశ్మీర్ పోలీసులు ముగ్గురు అనుమానితుల స్కెచ్‌లు విడుదల చేసి, వారి ఆచూకీ తెలిపిన వారికి రూ. 20 లక్షల చొప్పున నగదు బహుమతి ప్రకటించారు. అనుమానితుల్లో ఒకడైన మూసా అనే కోడ్ నేమ్‌తో వ్యవహరిస్తున్న ఆసిఫ్ ఫౌజీ పేరు గతంలో కూడా వినిపించింది. 2024లో పూంచ్‌లో భారత వైమానిక దళ కాన్వాయ్‌పై జరిగిన దాడిలో కూడా ఇతని ప్రమేయం ఉన్నట్లు నిఘా సంస్థలు భావిస్తున్నాయి.
ఎన్ఐఏ (NIA) దర్యాప్తు
ఈ కేసు దర్యాప్తు బాధ్యతను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) స్వీకరించగా, శ్రీనగర్ కేంద్రంగా ఇన్‌స్పెక్టర్ జనరల్ విజయ్ సఖారే నేతృత్వంలోని బృందం దర్యాప్తు నిర్వహిస్తోంది. జమ్మూకశ్మీర్ పోలీసులు ఎన్ఐఏకి పూర్తి సహకారం అందిస్తున్నారు. ఎన్ఐఏ దృష్టి ప్రధానంగా ఈ దాడి వెనుక ఉన్న మౌలికంగా కీలక పాతపు ముఠాలను వెలికి తీసేందుకు కేంద్రీకృతమై ఉంది. జమ్మూకశ్మీర్ పోలీసులు ఎన్ఐఏకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ దాడి వెనుక నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ప్రమేయం ఉందనే కోణంలో కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. ముఖ్యంగా, లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ అనుచరుల్లో ఒకడైన సైఫుల్లా కసూరి పాత్రపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించినట్లు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరి 2న కసూరి సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ వీడియోలో, ఫిబ్రవరి 2, 2026 నాటికి కశ్మీర్ స్వచ్ఛమైన భూమిగా మారుతుందని, రాబోయే రోజుల్లో ముజాహిదీన్‌లు దాడులను తీవ్రతరం చేస్తారని హెచ్చరించినట్లు అధికారులు గుర్తు చేస్తున్నారు.
Read also: Pahalgam : పహల్గాం దాడికి సూత్రధారి ఖలీద్ – ఉగ్రవాదుల స్కెచ్ విడుదల