తెలంగాణలో కాంట్రాక్టర్ల నిరసనపై బీఆర్ఎస్ (BRS) నాయకుడు హరీశ్రావు తీవ్రంగా స్పందించారు. కేవలం రెండేళ్ల పాలనలో బిల్లుల చెల్లింపుల కోసం కాంట్రాక్టర్లు సచివాలయంలో రెండుసార్లు ధర్నా చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చునని ఆయన విమర్శించారు. ప్రభుత్వంపై కాంట్రాక్టర్లలో నెలకొన్న అసంతృప్తికి ఇది నిదర్శనమని హరీశ్రావు అభిప్రాయపడ్డారు.
కమీషన్లే లక్ష్యంగా ప్రభుత్వం: హరీశ్రావు
గతంలో కమీషన్లు ఇవ్వకపోతే బిల్లులు క్లియర్ చేయడం లేదంటూ కాంట్రాక్టర్లు ఆర్థిక మంత్రి కార్యాలయాన్ని ముట్టడించారని, ఇప్పుడు ఆర్థిక శాఖ కార్యాలయం ముందు ధర్నా చేశారని హరీశ్రావు గుర్తు చేశారు. ఈ ప్రభుత్వంకు “మిషన్” గానీ, “విజన్” గానీ లేవని, కేవలం “కమీషనే” లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తి నెలకొందని ఆయన పేర్కొన్నారు.
ప్రజలు ఏకమై నిలదీస్తారు: హరీశ్రావు హెచ్చరిక
ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో ప్రజలందరూ ఏకమై ప్రభుత్వాన్ని నిలదీస్తారని హరీశ్రావు హెచ్చరించారు. ప్రభుత్వ తీరుపై ప్రజల్లో పెరిగిపోతున్న ఆగ్రహానికి ఈ నిరసనలు ఒక సూచిక అని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ప్రభుత్వం ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తుందో చూడాలి.