Waqf Amendment Bill : లోక్‌సభలో సుదీర్ఘ చర్చ అనంతరం ఆమోదం పొందిన వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు.. ఇప్పుడు రాజ్యసభ ముందుకొచ్చింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గురువారం ఈ బిల్లును ఎగువ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చ ప్రారంభించారు. ప్రస్తుతం రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లు పై చర్చలు కొనసాగుతున్నాయి. ఇక, ఈ బిల్లుపై బుధవారం లోక్‌సభలో 14 గంటలకు పైగా చర్చ జరిగింది. విపక్షాల ఆరోపణలు, అధికారపక్షం కౌంటర్లతో సభ వాడీవేడిగా సాగింది.

56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు
అనంతరం ఓటింగ్ ప్రక్రియ నిర్వహించగా. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. రాజ్యసభలోనూ దీనిపై చర్చ కోసం 8 గంటలు కేటాయించారు. అవసరమైతే సమయాన్ని పెంచనున్నారు. అనంతరం ఓటింగ్ చేపడతారు. ఎగువ సభలోనూ అధికార ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం ఉండటంతో బిల్లు గట్టెక్కడం లాంఛనమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉభయ సభల్లో ఆమోదం పొందిన అనంతరం రాష్ట్రపతి సంతకంతో ఇది చట్టంగా మారనుంది.
మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసేలా ఈ కొత్త బిల్లు
వక్ఫ్ పాలకవర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసేలా ఈ కొత్త బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. ఈమేరకు 1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు చోటుచేసుకోనున్నాయి. ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే ఈ మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ బిల్లును గతేడాది ఆగస్టులోనే కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అప్పుడు దీనిపై విపక్షాల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో దీనిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపింది. ఈ కమిటీ పలు ప్రతిపాదనలతో బిల్లుకు ఆమోదం తెలిపింది.