సాధారణంగా యానిమేషన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపవు. కానీ, ‘మహావతార్ నరసింహా’ (Mahavatar Narsimha) సినిమా ఈ అంచనాలను తారుమారు చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. జూలై 25న విడుదలైన ఈ చిత్రం, స్టార్ హీరోల సినిమాలకు కూడా సాధ్యం కాని రీతిలో భారీ వసూళ్లను రాబడుతోంది. విడుదలైన నాలుగో వారంలో కూడా ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఆగస్టు 16న శనివారం, హైదరాబాద్‌లో మధ్యాహ్నం ఆట సమయంలో 101 షోలు ప్రదర్శితం కాగా, అన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి.
వసూళ్లలో రికార్డులు
ఆగస్టు 14న రజినీకాంత్ నటించిన ‘కూలీ’, ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ నటించిన ‘వార్ 2’ వంటి భారీ చిత్రాలు విడుదలైనా, ‘మహావతార్ నరసింహా’ జోష్ మాత్రం తగ్గలేదు. ఆగస్టు 15న ఒక్క బుక్‌మైషో యాప్‌లోనే ఈ సినిమాకు 2.22 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ఆఫ్‌లైన్ అమ్మకాలు కలిపితే ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే రూ.250 కోట్ల వసూళ్లను దాటేసిందని సమాచారం. నాలుగో వారంలోనూ ఇదే జోరు కొనసాగిస్తే, వినాయక చవితి పండుగ వారాంతంలో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ తాండవం కొనసాగే అవకాశం ఉంది. ఈ వారం ముగిసేలోపు రూ.300 కోట్ల క్లబ్‌లో చేరి, ఫుల్ రన్‌లో రూ.350 నుంచి రూ.400 కోట్లు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు.
హిందీలో బాహుబలి రికార్డు బ్రేక్
‘మహావతార్ నరసింహా’ హిందీ డబ్బింగ్ వెర్షన్ కూడా అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. ఇప్పటికే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ‘బాహుబలి 1: ది బిగెనింగ్’ రికార్డును బద్దలు కొట్టింది. ‘బాహుబలి 1’ హిందీలో రూ.118.70 కోట్లు వసూలు చేసింది. ఈ రికార్డును బ్రేక్ చేయడం ద్వారా ‘మహావతార్ నరసింహా’, హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ చిత్రాల జాబితాలో టాప్ 10లోకి ప్రవేశించింది. చిన్న సినిమాగా వచ్చి, ప్రేక్షకుల ఆదరణతో ఇంతటి విజయాన్ని సాధించడం నిజంగా అసాధారణం.