బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై ముంబై పోలీసులు లుకౌట్ నోటీసు (Lookout notice issued against Shilpa Shetty, Raj Kundra) జారీ చేశారు. రూ. 60 కోట్ల ఆర్థిక మోసం కేసులో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్’ అనే తమ సంస్థ విస్తరణ కోసం తన వద్ద నుంచి ఈ డబ్బును తీసుకున్నారని, అయితే దానిని వ్యక్తిగత ఖర్చులకు వాడుకున్నారని దీపక్ కొఠారి అనే వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీపక్ కొఠారి తన ఫిర్యాదులో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులు 2015 నుంచి 2023 మధ్య కాలంలో ఈ డబ్బును తీసుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా, వారు తీసుకున్న డబ్బును అప్పుగా చూపి, పన్ను ఆదా కోసం పెట్టుబడిగా మార్చుకున్నారని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
ఈ లుకౌట్ నోటీసుతో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దేశం విడిచి వెళ్లే అవకాశం లేదు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు వారికి నోటీసులు పంపినట్లు సమాచారం. రూ. 60 కోట్ల మోసం ఆరోపణలు బాలీవుడ్ వర్గాల్లో కలకలం సృష్టించాయి. ఈ కేసు దర్యాప్తులో ఇంకా ఏఏ విషయాలు వెలుగులోకి వస్తాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.