భారతదేశంలో రైల్వేలు మొదటిసారిగా 1853లో బొంబాయి – థానే మధ్య ప్రారంభమయ్యాయి. అప్పటి నుండి రైల్వే వ్యవస్థ దేశంలోని ప్రయాణ సౌకర్యాలకు ఒక ప్రధానాధారంగా నిలిచింది. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మొత్తం 42 రైల్వే కంపెనీలు విడివిడిగా పనిచేస్తుండగా, 1951లో వాటన్నింటినీ ఏకీకృతం చేసి “ఇండియన్ రైల్వేస్”గా ఆవిర్భవించారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటిగా పేరుగాంచింది. ఈ వ్యవస్థ రోజూ లక్షలాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తూ, దేశంలోని సామాజిక-ఆర్థిక అభివృద్ధికి కీలకపాత్ర పోషిస్తోంది.
విస్తారమైన నెట్వర్క్
ప్రస్తుతం భారత రైల్వే వ్యవస్థ ప్రపంచంలో నాల్గో అతిపెద్ద నెట్‌వర్క్‌గా ఉంది. ఇది 17 జోన్లు, 68 డివిజన్లుగా సుమారు 1,23,000 కిలోమీటర్ల పొడవున విస్తరించింది. రైళ్ల సంఖ్య, దూర ప్రయాణాలే కాకుండా సరకు రవాణాలో కూడా రైల్వేలు ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయి. 1853లో మొదటి ప్రయాణికుల రైలు నడిచినప్పటి నుండి సాంకేతికత, సదుపాయాలు, వేగం, భద్రత ఇలా ప్రతి విభాగంలోనూ ఇండియన్ రైల్వేస్ గణనీయమైన అభివృద్ధి సాధించింది.

ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్ (Longest Railway Platform) కర్ణాటక రాష్ట్రంలోని శ్రీ సిద్ధరూధ స్వామిజీ హుబ్లీ జంక్షన్ (SSS Hubballi Junction)కు చెందింది. ఈ ప్లాట్‌ఫామ్ 1,507 మీటర్ల పొడవుతో గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. అంటే ఇది దాదాపు కిలోమీటరున్నర పొడవు ఉంటుంది. ఈ పొడవైన ప్లాట్‌ఫామ్‌పై ఒకే రైలు మొత్తం బోగీలు సులభంగా ఆగగలుగుతాయి. ఇంతకుముందు ఈ రికార్డు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ స్టేషన్ (1,366 మీటర్లు) వద్ద ఉండగా, హుబ్లీ స్టేషన్ ఆ రికార్డును అధిగమించింది. హుబ్లీ జంక్షన్ కర్ణాటకలో ప్రధాన రైల్వే హబ్‌గా ఉండి, బెంగళూరు, హోస్పేట్, వాస్కోడగామా, బెలగావి వంటి ముఖ్య పట్టణాలకు కీలకమైన రైల్వే కనెక్షన్ అందిస్తోంది.