ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా రంగానికి కొత్త ఊపుని ఇచ్చే విధంగా మెగా డీఎస్సీ నియామక(Mega DSC Recruitment) పత్రాల అందజేతకు ముస్తాబు అయింది. సెప్టెంబర్ 25వ తేదీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం వెనుక ఏర్పాటు చేసిన విశాల వేదికపై ఈ వేడుక జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (CBN&Pawan)ప్రత్యేక అతిథులుగా హాజరుకానుండగా, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. మొత్తం 16,347 మంది ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందించనున్నారు. ఈ సంఖ్యలో మహిళల శాతం దాదాపు 50% ఉండటం విశేషం. ఇది విద్యా రంగంలో స్త్రీలకు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతోందని ప్రభుత్వం భావిస్తోంది.

కూటమి ప్రభుత్వం (Kutami Govt) అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించింది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం మొదటి రోజే మెగా డీఎస్సీ ఫైల్‌పై సంతకం చేసింది. ఆ తరువాత కేవలం కొన్ని నెలల్లోనే రిక్రూట్‌మెంట్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేశారు. మొత్తం 5.7 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో 15,941 మంది ఎంపికయ్యారు. మిగిలిన 406 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేనందున వాటిని వచ్చే డీఎస్సీలో భర్తీ చేయనున్నారు. ఈ ప్రక్రియపై వైసీపీ 100కి పైగా కేసులు వేసినా ఒక్కదానికీ స్టే రాకపోవడం వల్ల ప్రభుత్వ నిబద్ధత, పారదర్శకత మరోసారి రుజువైంది. విద్యా రంగంలో నాణ్యత పెంపు కోసం ఉపాధ్యాయ నియామకాలు ఎంతో ముఖ్యమని లోకేష్ పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమం మొదట సెప్టెంబర్ 19న జరగాల్సి ఉన్నా భారీ వర్షాల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేక బస్సుల్లో హాజరవుతున్నారు. ఎంపికైన అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున విచ్చేయనున్నారు. సభా వేదిక కోసం ఆధునిక లైటింగ్, సౌండ్ సిస్టమ్, భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నియామకాలు కూటమి ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక ఘట్టమని, 150 రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయడం తమ పరిపాలనలోని వేగం, సమర్థతకు నిదర్శనమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఈ వేడుక ద్వారా కొత్త ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తారని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.